Ravichandran Ashwin: అశ్విన్ భార్య భావోద్వేగ పోస్ట్
Ravichandran Ashwin: రాజ్‌కోట్ టెస్టు మధ్యలో జట్టును విడిచి రవిచంద్రన్ అశ్విన్ చెన్నైకి వెళ్లిన విషయం తెలిసిందే. టెస్టుల్లో 500 వికెట్ తీసిన తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న అశ్విన్ హుటాహుటిని ఆసుపత్రికి పయనమయ్యాడు. ఆ తర్వాత సుమారు 48 గంటల తర్వాత వచ్చి మళ్లీ జట్టులో చేరాడు. అయితే ఈ 48 గంటల సమయం తమ జీవితంలో క్లిష్టమైన సమయమని అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ తెలిపారు.
రాజ్‌కోట్ టెస్టు ద్వారా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్.. ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. అయితే అశ్విన్ ఈ ఫీట్ సాధించిన కాసేపటికే.. అతడు చెన్నై వెళ్లాల్సి వచ్చింది. అశ్విన్ తల్లి ఆరోగ్యం బాలేకపోవడంతో అతడు చెన్నై వెళ్లినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో టెస్టులో మూడో రోజు ఆటకు పూర్తిగా దూరమయ్యాడు ఈ స్పిన్నర్. అయితే నాలుగో రోజు ఆట మధ్యలో మళ్లీ టీమిండియా జట్టులోకి వచ్చేశాడు అశ్విన్. టామ్ హార్ట్లీని ఔట్ చేశాడు.
రాజ్‌కోట్ టెస్టు రెండో రోజు ఆటలో జాక్ క్రాలీని ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 500 వికెట్ పడగొట్టిన అశ్విన్.. నాలుగో రోజు ఆటలో టామ్ హార్ట్లీని ఔట్ చేసి 501 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ 500 వికెట్.. 501 వికెట్‌కు మధ్య జరిగిన విషయాలపై అశ్విన్ భార్య ప్రీతి స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు.
ALSO READ: Ravichandran Ashwin కోసం స్పెషల్ ఫ్లైట్.. బీసీసీఐపై ప్రశంసల వర్షం
‘ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులోనే అశ్విన్ 500 వికెట్లు తీస్తాడని అందరం భావించాం. విశాఖపట్నంలోనూ అతడు చాలా ట్రై చేశాడు. కానీ, ఈ ఫీట్ అందలేదు. చివరికి మూడో టెస్టు వరకు వెళ్లింది. నిజానికి మేం అశ్విన్ 499వ టెస్టు వికెట్ తీసినప్పుడే స్వీట్లు తీసుకొచ్చి పెట్టాం. వాటిని అందరికీ పంచిపెట్టాం. రాజ్‌కోట్ టెస్టులో 500వ వికెట్ వచ్చింది. అయితే, మేం నిశ్శబ్దంగా ఉండిపోయాం’ అని ప్రీతి రాసుకొచ్చారు.
‘అశ్విన్ తీసిన 500 వికెట్ నుంచి 501 వికెట్ మధ్య గ్యాప్‌లో చాలా జరిగాయి. మా జీవితంలో అత్యంత క్లిష్టమైన 48 గంటలు అవి. ఏది ఏమైనా టెస్టులో 500 వికెట్లు తీయడమనేది చాలా గొప్ప విషయం. రవిచంద్రన్ అశ్విన్ ఒక అద్భుతమైన వ్యక్తి. అతడిని చూసి ఎంతో గర్వపడుతున్నా. మేం ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం అశ్విన్’ అని ప్రీతి పేర్కొన్నారు.
అశ్విన్ 500 టెస్టు వికెట్ తీసిన అనందంలో ఉండగానే అతడి తల్లి చిత్ర ఆరోగ్యం బాలేదని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆట ముగిసిన వెంటనే బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫ్లైట్‌లో అతడు రాజ్‌కోట్ నుంచి చెన్నైకి వెళ్లాడు. ఆమె ఆరోగ్య కాస్త కుదుటపడ్డాక మళ్లీ అదే ఫ్లైట్‌లో రాజ్‌కోట్ వచ్చి.. నాలుగో రోజు బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లు వేసిన యాష్.. ఒక వికెట్ తీశాడు. ఇక మ్యాచ్‌లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
ALSO READ: Ravichandran Ashwin: స్టార్ స్పిన్నర్ సరికొత్త రికార్డు..!