Ravichandran Ashwin: స్టార్‌ స్పిన్నర్‌ సరికొత్త రికార్డు..!

Ravichandran Ashwin: భారత్‌ – ఇంగ్లాండ్‌ మధ్య రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న 3వ టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ జాబితాలో శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. మురళీ ధరన్‌ కేవలం 87 టెస్టుల్లో 500 వికెట్లు తీశాడు. భారత్‌ నుంచి 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఈ జాబితాలో భారత్‌ నుంచి అనిల్‌ కుంబ్లే (619 వికెట్లు) తర్వాతి స్థానంలో అశ్విన్‌ నిలిచాడు. 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా అశ్విన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు. ఇప్పటికే వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచులో అశ్విన్‌ రికార్డు సృష్టించాడు.

ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అశ్విన్‌ మరో కొత్త చరిత్ర నమోదు చేసాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ ఘ‌న‌త చంద్రశేఖ‌ర్ పేరిట ఉంది. చంద్రశేఖ‌ర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు ప‌డ‌గొట్టగా ఈ రికార్డును అశ్విన్‌ బద్దలుకొట్టాడు. అశ్విన్‌ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లతో ఆ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. వీరిద్దరి త‌రువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో ఉన్నాడు.

ఇంగ్లాండ్ జ‌ట్టుపై ఇప్పటి వ‌ర‌కు ఏ టీమ్ఇండియా బౌల‌ర్ కూడా వంద వికెట్లు తీయ‌లేదు. అశ్విన్ ఇప్పటి వ‌ర‌కు ఇంగ్లాండ్ పై 98 వికెట్లు తీశాడు. అత‌డు మ‌రో 2 వికెట్లు గ‌నుక తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన‌ మొద‌టి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఇక రెండు జ‌ట్ల మ‌ధ్య అత్యధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా జేమ్స్ ఆండర్సన్ ఉన్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా సెంచరీ హీరోలుగా నిలువగా తొలిసారి బరిలో దిగిన బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ , ధ్రువ్ జురెల్‌ కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ఓవర్‌ నైట్‌ స్కోరు 326/5 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. జో రూట్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. దీంతో డెబ్యూ ప్లేయర్‌ ధ్రువ్‌ జరెల్‌తో కలిసి సీనియర్ ప్లేయర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టు స్కోరు ముందుకు తీసుకెళ్లాడు. ఎనిమిదో వికెట్ కి వీరిద్దరూ 77 పరుగులు జోడించారు. కానీ కొద్ది టైం లోనే వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది.

చివర్లో బుమ్రా దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లోనే మూడు ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. దీంతో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్ ధాటిగా బ్యాటింగ్‌ చేస్తోంది. బజ్‌బాల్‌ ఆటతో చెలరేగుతోంది. ప్రస్తుతం ఒక వికెట్‌ నష్టానికి 138 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ అద్భుత శతకంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.