Ravichandran Ashwin: రోహిత్ గురించి నాకు తెలుసు.. అలాంటివాడు కాదు
Ravichandran Ashwin: ఐపీఎల్ 2025 వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఎవరు ఏ టీంలో ఉంటారో ఎవరు జంప్ అవుతారో అనే ఉత్సుకత క్రికెట్ అభిమానుల్లో రోజురోజుకీ పెరిగిపోతోంది. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టీం నుంచి వెళ్లిపోతాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో రోహిత్‌ను ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్‌గా తొలగించి ఆ అవకాశం హార్దిక్ పాండ్యకు ఇవ్వడంతో రోహిత్ చాలా బాధపడ్డాడు. ఈ నేపథ్యంలో 2025 ఐపీఎల్ నాటికి రోహిత్ వేరే టీంలో ఉంటాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు.
రోహిత్ ఎలాంటివాడో తనకు తెలుసని.. వేరే టీం డబ్బు ఎక్కువగా ఇస్తుందని వెళ్లిపోయే వ్యక్తి కాదని అన్నాడు. 2024 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సరిగ్గా ఆడలేకపోయినప్పటికీ రోహిత్ మాత్రం బాగానే ప్రదర్శించాడని.. తన కెరీర్లో ఎంతో సంపాదించుకున్న రోహిత్ డబ్బు కోసం వేరే టీంలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.