PCB : టీమిండియా పాకిస్థాన్‌కి రాకపోతే… పాక్ క్రికెట్ బోర్డు హెచ్చరిక
PCB : 2025లో జరగబోయే ICC ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను పాకిస్థాన్ అతిథ్యం వహించనుంది. అయితే ఈ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో పెడితే టీమిండియా పాల్గొనదని BCCI తేల్చి చెప్పేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప తాము పాకిస్థాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ తెలిపింది. కావాలంటే ఈ మ్యాచ్‌ను వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే మంచిదని సూచించింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా పాకిస్థాన్‌కు రాకపోతే.. 2026లో భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు తమ పాక్ ఆటగాళ్లు రారని హెచ్చరించింది.
ఆసియా కప్ కోసం టీమిండియా 2008లో పాకిస్థాన్‌కు వెళ్లి ఆడింది. భారత్ పాక్‌కి వెళ్లడం అదే చివరి సారి. అయితే ఈసారి మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌ను మళ్లీ పాకిస్థాన్‌కు తీసుకురావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ విషయంలో మాత్రం తాము రాజీ పడేదే లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. మరి దీనిపై బీసీసీఐ ఏమంటుందో వేచి చూడాలి.