Mushir Khan: సర్ఫరాజ్ తమ్ముడొచ్చాడని చెప్పు…!
Mushir Khan: విదర్భతో జరుగుతున్న ఫైనల్‌లో ముషీర్.. 326 బంతులాడి 10 బౌండరీల సాయంతో 136 పరుగులు చేశాడు. తద్వారా ముషీర్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 29 ఏండ్ల కిందట నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు.
యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో నయా రికార్డును నెలకొల్పాడు. విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో చిరస్మరణీయ శతకం సాధించాడు. విదర్భ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ముషీర్ ఖాన్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు సాధించాడు. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించిన పిన్న వయసు బ్యాటర్‌గా నయా రికార్డు సృష్టించాడు. ముషీర్ 19 ఏళ్ల 14 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.
1995లో పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సచిన్ సెంచరీ బాదాడు. 21 ఏళ్ల వయస్సులో మూడంకెల స్కోరు అందుకున్నాడు. 29 ఏళ్ల తర్వాత సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే సచిన్ కళ్ల ఎదుటే ఈ రికార్డు బ్రేక్ అవ్వడం విశేషం. ఫైనల్‌ను చూడటానికి సచిన్ వాంఖడేకు వచ్చిన విషయం తెలిసిందే. (Mushir Khan)
వాంఖడే వేదికగా జరుగుతున్న రంజీ ఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్ దిగ్గజాలు వీక్షించారు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు దిలీప్ వెంగ్‌సర్కార్, చంద్రకాంత్ పండిట్, రోహిత్ శర్మలు మ్యాచ్‌ను గ్యాలరీ నుంచి చూశారు. సచిన్, వెంగ్‌సర్కార్, చంద్రకాంత్‌లు ముంబై జట్టుకు ఆడినవాళ్లే. చంద్రకాంత్ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అయిపోయాక ధర్మశాల నుంచి ముంబైకి వచ్చిన రోహిత్.. మ్యాచ్‌ను వీక్షించాడు. బీసీసీఐ ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ (ఎక్స్) లో షేర్ చేసింది.
ఇక ఈ విషయంపై ముషీర్ ఖాన్ మాట్లాడాడు. సచిన్ వచ్చినట్లు తొలుత తనకి తెలియదని పేర్కొన్నాడు. ”సచిన్ సర్ వచ్చినట్లు నాకు తెలియదు. 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు బిగ్ స్క్రీన్‌పై సచిన్‌ను చూశాను. ఆ తర్వాత ఆయన్ని చూసి ప్రేరణ పొందాను. ఇవాళ నా ఆటతో సచిన్‌ను ఆకట్టుకోవాలని బ్యాటింగ్ చేశాను. టీమిండియా టెస్టు క్రికెటర్లు అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడటాన్ని గర్విస్తున్నాను. అయితే విదర్భ జట్టులో ప్రతి ఒక్కరు రహానెను ఔట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో నేను పరుగులు సాధించడానికి సులభం అయ్యింది” అని ముషీర్ ఖాన్ తెలిపాడు.
ఇక ఈ ఏడాది సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన ముషీర్.. 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఫైనల్లో వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై విజయం దిశగా దూసుకెళ్తోంది. ముషీర్ ఖాన్ (136; 326 బంతుల్లో 10×4), శ్రేయస్ అయ్యర్ (95; 111 బంతుల్లో, 10×4, 3×6), అజింక్య రహానె (73; 143 బంతుల్లో, 5×4, 1×6) సత్తాచాటడంతో విదర్భకు ముంబై 538 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదన మొదలుపెట్టిన విదర్భ పోరాడుతోంది. 20 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.