Michael Vaughan: టీమిండియాకు ముందే సమాచారం అందింది.. మళ్లీ ఏడుపు మొదలుపెట్టిన వాగన్
Michael Vaughan: T20 వరల్డ్ కప్ టీమిండియాను వరించడంపై మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖెల్ వాగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని రోజులుగా టీమిండియాపై ICCపై పడి ఏడుస్తున్నాడు. మొన్న జరిగిన ఉత్కంఠపోరులో భారత్ ఘన విజయం సాధించడంతో వాగన్‌తో పాటు ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా ఏడుపు మొదలుపెట్టాడు.. ICC T20 వరల్డ్ కప్ కేవలం భారత్ కోసమే పెట్టినట్లుందని.. ఈ టోర్నమెంట్ కేవలం భారత్‌ను గెలిపించడానికే పెట్టినట్లుందని ఆరోపిస్తున్నారు.
వాగన్ రెండు పాయింట్లపై బలంగా మాట్లాడుతున్నాడు. భారత్ సెమీ ఫైనల్స్‌కు వెళ్తే కచ్చితంగా ఆ మ్యాచ్‌ను గుయానాలోనే ఆడతారని టీమిండియాకు ముందే తెలుసని.. అన్ని టీంలతో పోలిస్తే కేవలం టీమిండియా ఒక్కటే అన్ని మ్యాచ్‌లను ఒకే సమయంలో ఆడిందని అంటున్నాడు. భారత క్రికెట్ వీక్షకుల కోసం కేవలం ఉదయం పూట మాత్రమే మ్యాచ్‌లు ఆడేలా చర్యలు తీసుకున్నారట. ఇతర టీమ్స్ మాత్రం రాత్రి వేళల్లో లైట్ల మధ్య ఆడాల్సి వచ్చిందని అంటున్నాడు. టీమిండియా టోర్నమెంట్‌లో ఆడితే మరింత రెవెన్యూ వస్తుందని ICC కేవలం టీమిండియాకు మాత్రమే సపోర్ట్ చేసిందని వాగన్ తెలిపాడు.
“” ఇది కచ్చితంగా టీమిండియా టోర్నమెంటే. వాళ్లకు కావాల్సినప్పుడు ఆడారు. వాళ్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్ ఎక్కడ ఆడతారో కూడా వారికి ముందే సమాచారం అందింది. వారి మ్యాచ్‌లన్నీ ఉదయం పూటే పెట్టారు. ఎందుకంటే వారు ఉదయం ఆడితే ఇండియాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ రాత్రి మ్యాచ్ చూసేందుకు వీలుగా ఉంటుందని ప్లాన్ వేసారు. క్రికెట్ ప్రపంచంలో డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుసు. కానీ కేవలం టీమిండియా వల్లే డబ్బు ఎక్కువ వస్తుందని ఆశించిన ఐసీసీ కేవలం వారి తరఫు మాత్రమే నిలబడటం చాలా తప్పు “” అని మైఖెల్ వాగన్ ఆరోపించారు.
మరోపక్క ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. టీ20 టోర్నమెంట్‌లో రాజీ కుదిరింది అనే విషయం ఇండియన్ ఫ్యాన్స్‌కి కూడా బాగా తెలుసని ఆయన అన్నారు.