KL Rahul: కెప్టెన్సీ కోసం ఇంతకు దిగజారాలా?
KL Rahul: ఆత్మాభిమానం లేదు.. కెప్టెన్సీపై ఆశ మాత్రమే ఉంది. కేఎల్ రాహుల్ పరిస్థితి ఇది. 2025 ఐపీఎల్‌కు గానూ త్వరలో వేలం ప్రక్రియ జరగనుంది. ఈ ఏడాది IPL మ్యాచ్‌లో లఖ్‌నౌ సూపర్ జైంట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంకా అందరూ చూస్తుండగానే మైదానంలోనే రాహుల్‌ను నోటికొచ్చినట్లు తిట్టి అవమానించారు. ఓ యజమానిగా ఆట తీరు సరిగ్గా లేకపోతే మందలించే హక్కు ఆయనకు ఉండచ్చు. కానీ సమయం సందర్భంగ కూడా ముఖ్యమేగా.
రాహుల్ ఓ పెద్ద క్రికెటర్. అతనికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అలాంటి రాహుల్‌ని పట్టుకుని స్టేడియంలో లక్షలాది మంది చూస్తుండగానే రెచ్చిపోయి తిడితే ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదు. ఆ ఘటన తర్వాత అందరూ రాహుల్‌కే మద్దతు తెలిపారు. సూపర్ జైంట్స్‌ను వదిలేయాలని సలహాలు ఇచ్చారు. ఆ ఘటన తర్వాత రాహుల్ ఎటూ సూపర్ జైంట్స్‌ను వదిలేస్తాడని సంజీవ్ గోయంకా కూడా అనుకున్నట్లున్నారు. అందుకే రాహుల్‌కి బదులు మరో ఆటగాడిని కెప్టెన్‌ని చేయాలని అనుకున్నారు.
ఈలోగా రాహుల్ గోయంకాకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ వేలం ప్రక్రియకు ముందు కలకత్తాకు వెళ్లి మరీ సంజీవ్ గోయెంకాను అతని కార్యాలయంలో కలిసాడు. కెప్టెన్సీ తనకే ఇవ్వాలని.. తనను టీంలో రీటైన్ చేయాలని కోరాడట. ఇక సంజీవ్ గోయంకా సూపర్ జైంట్స్‌కు కోచ్‌గా జహీర్ ఖాన్‌ను నియమించాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంత అవమానం జరిగిన తర్వాత కూడా తనంతట తనే వెళ్లి కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ తనకే ఇవ్వాలని అడగడం ఎంత వరకు సమంజసం అని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయాయి.