Kane Williamson: ముచ్చటగా మూడోసారి తండ్రయిన కేన్ మామ..!

Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి సారా రహీమ్ ఒక పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది. కేన్ దంపతులకు ఇది మూడో సంతానం. వీరికి ఇది వరకే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మహాలక్ష్మి అడుగుపెట్టడంతో కేన్ మామ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్. ‘ఇకపై మూడు..ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయికి స్వాగతం. మీ సురక్షిత రాక, ముందుకు సాగిన ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు’ అంటూ తన ఇన్ స్టా గ్రామ్‌ లో పోస్ట్ షేర్ చేశాడు విలియమ్సన్.

ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. స్టార్ క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కేన్ మామకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్ చూసిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘కంగ్రాట్స్ లెజెండ్’ అని విష్ చేశాడు. కేన్ విలియమ్సన్, సారా రహీమ్‌లకు ఇప్పుడు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు 2015 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే వారు ఇప్పటివరకు అధికారికంగా వివాహం చేసుకోలేదు. విలియమ్సన్ తరచూ కుటుంబ సభ్యులతో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. శ్రీలంక స్టార్ క్రికెటర్ దినేష్ చండిమాల్ కూడా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అతని ఇంట్లో పెద్ద వేడుక కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

తండ్రి కాబోతున్న సందర్భరంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడు. గత కొంత కాలంగా శతకాల మీద శతకాలు బాదేస్తున్న కేన్ విలియమ్సన్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విలియమ్సన్ చివరిగా దక్షిణాప్రికాతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఆడాడు. అనేక రికార్డులను నమోదు చేశాడు. మాజీ టెస్టు కెప్టెన్ టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత వేగంగా 32 సెంచరీలు చేసిన ప్లేయర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. కేన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడు. అతను గత సీజన్ లో గాయపడి చాలాకాలం పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.

కాగా ఫిబ్రవరి 29 నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు వెల్లింగ్టన్‌లో జరగనుంది. కేన్ విలియమ్సన్ కూడా ఈ టెస్టులో ఆడనున్నాడు. ఈ న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీల మోత మోగించాడు. తొలి టెస్టులో 118, 109 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టులో 43, 133 రన్స్ బాదాడు. విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 98 టెస్టులు, 165 వన్డేలు, 89 టీ20లు ఆడాడు. ఈ నేపథ్యంలో టీ 20 సిరీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనుకుంటోంది న్యూజిలాండ్ టీమ్‌.