Ishan Kishan – Shreyas Iyer: ఇషాన్, శ్రేయస్‌లపై వేటు
Ishan Kishan – Shreyas Iyer: టీమ్ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు BCCI షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రంజీట్రోఫీకి దూరంగా ఉండడంతో ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల పై చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బీసీసీఐ ఇస్తున్న సెంట్రల్ కాంట్రాక్ట్ 2023లో శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ బిలో ఉండగా ఇషాన్ కిషన్ గ్రేడ్ సిలో ఉన్నారు. ఈక్రమంలో శ్రేయస్ రూ.3 కోట్ల వార్షిక వేతనాన్ని పొందుతుండగా ఇషాన్ కోటి జీతం అందుకుంటున్నాడు. బోర్డు ఆదేశాలను వీరిద్దరు బేఖారతు చేస్తూ రంజీల్లో ముంబైకి అయ్యర్, జార్ఖండ్‌కు కిషన్ అందుబాటులో ఉండడం లేదు. అతి త్వరలోనే బీసీసీఐ 2024కు సంబంధించిన కాంట్రాక్ట్స్‌లను ప్రకటించనుంది. ఇందులో ఈ ఇద్దరికి స్థానం ఇవ్వొద్దని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లుగా ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. మానసిక సమస్యలతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ అర్థాంతరంగా తప్పుకోగా ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో సెలక్టర్లు అయ్యర్ పై వేటు వేశారు. దీంతో అయ్యర్ వెన్ను నొప్పి అంటూ రంజీకి దూరంగా ఉన్నాడు. అయితే.. అయ్యర్‌కు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్య లేదని ఎన్‌సీఏ అధికారులు ఇప్పటికే బీసీసీఐకి నివేదిక ఇచ్చారు. ఎన్‌సీఏ రిపోర్ట్‌లలో తప్పు ఉండటం అసంభవమని అంటున్నారు. క్రికెట్ ఆడకుండా శ్రేయస్ ఎలా గాయపడుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Ishan Kishan – Shreyas Iyer)
ALSO READ: Ishan Kishan: టార్గెట్ ఇషాన్ కిషన్..!
ఇంగ్లండ్‌తో వైజాగ్, హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో తుది జట్టులో శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 104 రన్స్ ( 27, 29, 35, 13 ) మాత్రమే చేసి నిరాశపరిచాడు. టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ కీలకంగా నిలిచే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లతో పాటు సెలెక్టర్లు భావించారు. ఫామ్ లేమితో వారి ఆశలను అయ్యర్ వమ్ము చేశాడు. శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టిన సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌కు ఎంపికచేశారు. అరంగేట్రం టెస్ట్‌లోనే రెండు హాఫ్ సెంచరీలతో సర్ఫరాజ్ అదరగొట్టాడు.
పర్సనల్ ప్రాబ్లెమ్స్‌తో ఇంగ్లండ్ సిరీస్‌కు తన పేరును పరిశీలించవద్దని బీసీసీఐకి తెలిపిన ఇషాన్ కిషన్ దుబాయ్‌లో స్నేహితులతో జల్సాలు చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. మానసిక సమస్య అంటూ చెబుతున్న ఇషాన్.. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి ఐపీఎల్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టాడు. ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేని ఆటగాళ్లతో పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ప్లేయర్లు అందరూ దేశవాళీ క్రికెట్‌ను ఆడాలని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖలు రాశారు. అయినప్పటికీ ఈ ఆదేశాలను ఇషాన్, అయ్యర్‌లు పట్టించుకోలేదు.
‘అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ.. టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌ను ఫైనలైజ్ చేసింది. అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ఈ సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి ఇషాన్ కిషన్, అయ్యర్‌లను తొలగించే అవకాశం ఉంది. బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేస్తూ దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంపై బోర్డు ఆగ్రహంగా ఉంది.’అని ఓ అధికారి మీడియాతో అన్నారు. ఏది ఏమైనా బీసీసీఐ 2024-2025కు సంబంధించి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటిస్తే కానీ ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.
ALSO READ: Rishabh Pant: మా కెప్టెన్ అతడే.. తగ్గేదేలేదంటున్న ఢిల్లీ క్యాపిటల్స్