Ravichandran Ashwin కోసం స్పెషల్ ఫ్లైట్.. బీసీసీఐపై ప్రశంసల వర్షం
Ravichandran Ashwin: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. రెండో రోజు ఆట తర్వాత భారత బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. మూడు రోజు మొత్తం ఆటకు దూరంగా ఉన్నాడు.. ఎమర్జెన్సీ కావడంతో చెన్నైకు వెళ్లిపోయాడు. నాలుగో రోజు తిరిగి జట్టుతో చేరి బౌలింగ్ కూడా చేశాడు. అయితే అశ్విన్ కోసం BCCI సెక్రటరీ జయ్ షా (Jay Shah) స్పెషల్ ప్రైవేట్ ఛార్టర్ ప్లేన్ ఏర్పాటు చేశారట..
ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిశాక రవిచంద్రన్ అశ్విన్ సడెన్‌గా ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు ఫ్యామిలీ ఎమర్జెన్సీ సందర్భంగా అశ్విన్ మూడో టెస్టు నుంచి తప్పుకుంటున్నట్లు BCCI ప్రకటనలో తెలిపింది. BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ట్వీట్‌తో.. అశ్విన్ తల్లికి ఆరోగ్యం బాలేదని తెలిసింది. ఆ సమయంలో ఆమె దగ్గరుండాలని భావించిన అశ్విన్ చెన్నై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు శుక్లా చెప్పాడు. ఆస్పత్రిలో చేరిన తన తల్లిని పరామర్శించిన అశ్విన్.. ఆమె కోలుకుందని తెలిసిన వెంటనే రాజ్‌కోట్ పయనమయ్యాడు. ఆట నాలుగో రోజు టీ బ్రేక్ సమయంలో జట్టుతో చేరాడు.
ALSO READ: Ravichandran Ashwin: స్టార్ స్పిన్నర్ సరికొత్త రికార్డు..!
అశ్విన్ చెన్నైకి వెళ్లేందుకు బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసిందంట. ఈ మేరకు టీమిండియా మాజీ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి ఈ విషయం చెప్పాడు. బీసీసీఐ సెక్రటరీ జై షా అశ్విన్ కోసం ప్రైవేట్ ఛార్టర్ ప్లేన్ ఏర్పాటు చేసి చెన్నైకి పంపించినట్లు మ్యాచ్ కామెంటరీ సందర్భంగా వివరించాడు శాస్త్రి. మళ్లీ వచ్చేందుకు కూడా బీసీసీఐనే ఏర్పాట్లు చేసిందని అన్నాడు. దీంతో బీసీసీఐ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి.
మూడో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా బౌలింగ్ చేసిన అశ్విన్.. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ వికెట్ తీసి టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని సాధించాడు. ఆ రోజు ఆట ముగిశాక తన తల్లికి బాగాలేదని తెలిసిన యాష్.. హుటాహుటిన చెన్నై వెళ్లాడు. తిరిగి నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి జట్టుతో చేరి.. బౌలింగ్ కూడా చేశాడు. టామ్ హార్ట్లీ వికెట్ తీసి 501వ వికెట్ కూడా ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి డబుల్ సెంచరీతో చెలరేగగా.. ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. జడేజా ఐదు వికెట్లతో విజృంభించగా.. పర్యటక ఇంగ్లాండ్ 122 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో భారత్ ప్రస్తుతం సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ALSO READ: Ravichandran Ashwin: అశ్విన్ అనూహ్య నిర్ణయం వెనకున్న కారణం ఏంటి?
ఆటగాళ్ల కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి బీసీసీఐ కొంత కాలంగా పూర్తి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. అకస్మాత్తుగా తొలి టెస్టుకు ముందు ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంతో జట్టును వీడాడు. ఇంతకీ అతడికి ఏమైందో తెలియరాలేదు. మూడో టెస్టుకు ముందు కూడా మరోసారి విరాట్ కోహ్లీ సెలక్షన్‌కు అందుబాటులో లేడని పేర్కొన్న బీసీసీఐ.. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని పేర్కొంది.