Amit Mishra: తప్పంతా కోహ్లీదే.. ఇక వాళ్లు కోహ్లీని ఎలా గౌరవిస్తారు?
Amit Mishra: 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌కి మధ్య జరిగిన గొడవ క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఇద్దరు సమవుజ్జీలు మైదానంలో అందరి ముందు తిట్టుకోవడం సంచలనంగా మారింది. ఆ తర్వాత గంభీర్ కోహ్లీ కలిసిపోయారు అనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ లేదని అన్నాడు స్పిన్నర్ అమిత్ మిశ్రా.
“” బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్‌పై మేము (లఖ్‌నౌ సూపర్ జైంట్స్) గెలవడం దగ్గర్నుంచి గొడవ మొదలైంది. బెంగళూరు ఓడిపోవడంతో చాలా మంది గట్టిగా కేకలు వేస్తున్నారు. దాంతో వారిని సైలెంట్‌గా ఉండండి అని చెప్పడానికి గంభీర్ నోటిపై వేలు పెట్టినట్లు సైగ చేసారు. గంభీర్ అలా చేయడం కోహ్లీకి నచ్చలేదు. అక్కడే గొడవ మొదలైంది. అయితే ఆ గొడవ అక్కడికే ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో కోహ్లీ మాత్రం ఇంకా వదల్లేదు. రెండు టీమ్స్ కలిసినప్పుడు మళ్లీ కోహ్లీ లఖ్‌నౌ టీంను నోటికొచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టాడు. కైల్ మైయర్స్‌తో కోహ్లీకి ఎలాంటి విభేదం లేదు. కానీ కోహ్లీ అతన్ని కూడా నోటికొచ్చినట్లు తిట్టాడు.
నవీన్ ఉల్ హక్ బౌలింగ్ చేస్తుంటే అతన్ని కూడా తిట్టాడు. ఇవన్నీ కోహ్లీ చేయకుండా ఉండాల్సింది కానీ అతను అలా చేయలేదు. మిడిల్‌లో నవీన్‌తో పాటు నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ నాతో కూడా గొడవపడ్డాడు. నవీన్‌తో నీకెందుకు నీ స్థాయి ఏంటి అతని స్థాయి ఏంటి అతనితో అవసరమా అని నేను కోహ్లీని అడిగాను. అందుకు కోహ్లీ ఆ విషయం నాకు కాదు నవీన్‌కి చెప్పు అన్నాడు. గేమ్ అయిపోయిన తర్వాత హ్యాండ్‌షేక్ ఇచ్చుకుంటున్న సమయంలో మళ్లీ విరాట్ కోహ్లీ తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు గంభీర్ కలగజేసుకున్నాడు. ఎందుకు మళ్లీ తిట్టుకుంటున్నారు మనం గేమ్ గెలిచాం కదా అని సర్దిచెప్పి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. అప్పుడు నవీన్ డ్రెస్సింగ్ రూంకి వచ్చి కోహ్లీ మళ్లీ తిడుతున్నాడు అని చెప్పాడు. ఆ యువ క్రికెటర్లు ఇక కోహ్లీకి రేపు ఏం మర్యాద ఇస్తారు “” అని తెలిపారు మిశ్రా