Sanjiv Goenka: ధోనీనే తీసేసాడు.. రాహుల్ ఓ లెక్కా.. ఎవరీ సంజీవ్ గోయెంకా?
Sanjiv Goenka: నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ బాదిన వీర బాదుడికి లఖ్నౌ సూపర్ జైంట్స్ ముఖం వాచిపోయింది. దాంతో సోషల్ మీడియాలో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు ఆ టీం యజమాని సంజీవ్ గోయెంకా తెగ ట్రెండ్ అవుతున్నారు. ఎందుకంటే.. స్టేడియంలోనే కేఎల్ రాహుల్‌ని గోయెంకా ఇష్టం వచ్చినట్లు తిట్టడం వైరల్‌గా మారింది. రాహుల్ ఒక స్టార్ క్రికెటర్ అని ఒక యజమానిగా తిట్టాలి అనుకుంటే డ్రెస్సింగ్ రూంకి తీసుకెళ్లి మాట్లాడాలి కానీ ఇలా లక్షలాది మంది ఎదుట తిడితే అతని పరువు ఏమవ్వాలి అని మండిపడుతున్నారు.
నాడు ధోనీని తీసేసాడు
సంజీవ్ గోయెంకాకి ఆటగాడు ఎవరు ఎంత తోపు అనే దానితో సంబంధం లేదు. ఎంఎస్ ధోనీనే తీసేసిన చరిత్ర సంజీవ్ గోయెంకాది. ఇక కేఎల్ రాహుల్ ఎంత చెప్పండి. లఖ్నౌ సూపర్ జైంట్స్ టీం పుట్టింది 2022లో. దాదాపు రూ.7090 కోట్లు పెట్టి సంజీవ్ గోయెంకా ఈ టీంను సాధించుకున్నాడు. 2017లో రైజింగ్ పుణె సూపర్‌జైంట్స్ అనే ఐపీఎల్ టీంకి సంజీవ్ గోయెంకా యజమానిగా ఉన్నాడు. ఆ సమయంలో ఎం ఎస్ ధోనీ టీంకి కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ గోయెంకా 2017 ఐపీఎల్ సమయంలో ధోనీని కెప్టెన్‌గా తీసేసి ఆస్ట్రేలియా స్కిప్పర్ స్టీవెన్ స్మిత్‌ను నియమించాడు. రాహుల్ కంటే ధోనీ సీనియర్. అలాంటి ధోనీనే పక్కన పెట్టిన గోయెంకా ఇక 2025 సీజన్లో కేఎల్ రాహుల్‌ని పక్కన పెట్టకుండా ఉండడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.