Temple: గుడిలోని గ‌డ‌ప‌ను ఎందుకు మొక్కాలి?

గ‌డప అనేది కేవ‌లం ఆల‌యంలోనే (temple) కాదు ప్ర‌తి ఇంటికీ ఉంటుంది. కాక‌పోతే ఇంట్లోని గ‌డ‌ప‌ల‌ను చెక్క‌తో త‌యారుచేస్తారు. కానీ ఆల‌యాల్లోని గ‌డ‌ప‌ల‌ను రాతితో చెక్కి ఉంటాయి. ఆ రాళ్ల‌కే వెండి, బంగారం రేకుల‌తో కూడా త‌యారుచేస్తారు. మ‌నం ఆల‌యాల్లోకి ప్ర‌వేశించే ముందు గ‌డ‌ప‌ను న‌మస్క‌రించి దాటి వెళ్తుంటాం. అస‌లు గ‌డ‌ప‌కు ఎందుకు న‌మ‌స్క‌రించాలి? దీని వెనుక ఓ క‌థ ఉంది. అదేంటంటే..

భద్రుడు అనే రుషి.. భ‌ద్రం అనే ప‌ర్వ‌తంగా.. హిమ‌వంతుడు అనే భ‌క్తుడు హిమాల‌యంగా.. నారాయణుడు అనే భ‌క్తుడు నారాయ‌ణాద్రిగా అవ‌త‌రించార‌ని పురాణాలు చెప్తున్నాయి. భ‌గ‌వంతుడే ఆ భ‌క్తుల కోసం ఆ కొండ‌ల‌పై వెలిసిన‌ట్లు పురాణాల్లో ఉంది. ఆ కొండ‌ల నుంచి ప‌డిన రాళ్ల‌నే ఆల‌యానికి గ‌డ‌ప‌లుగా ఉంచుతార‌ట‌. నిత్యం దేవుడిని ద‌ర్శ‌నం చేసుకునే ముందు ఆ గ‌డ‌ప‌కు ద‌క్కిన పుణ్యానికి… అంత‌టి భ‌క్తుడిని దాటుకుని వెళ్తున్నందుకు క్ష‌మించ‌మ‌ని అడ‌గ‌ట‌మే గ‌డ‌ప‌కు న‌మ‌స్క‌రించ‌డం వెన‌క అర్థం.

అందుకే దేవాలయంలోకి వెళ్తే ముందు గ‌డ‌ప‌ను తొక్కి వెళ్ల‌కూడదు. కేవ‌లం దాటుకుని మాత్ర‌మే వెళ్లాల‌ని చెప్తుంటారు. దేవాలయంలోకి వెళ్లేముందు ఓ దేవా.. నేను నీ స‌న్నిధిలోకి అడుగుపెడుతున్నాను అని దేవుడి అనుమ‌తి తీసుకోవ‌డానికి గ‌డ‌ప‌కు మొక్కుతారు అని కూడా చెప్తుంటారు. గ‌డ‌ప‌ను భ‌గ‌వంతుడి పాదాలుగా కూడా భావిస్తార‌ట‌.  (temple)