Badrinath: ఇక్కడ ఎందుకు శంఖం పూరించకూడదు?
Spiritual: ఆలయాల్లో శంఖం పూరించడం చూస్తూనే ఉంటాం. ఏవైనా కార్యక్రమాలు, పూజలు, హారతులు ఇవ్వడానికి ముందు పూజారులు శంఖం పూరిస్తారు. కానీ బద్రీనాథుడి (badrinath) ఆలయంలో మాత్రం శంఖం పూరించడానికి అనుమతించరు.
ఎందుకంటే బద్రీనాథుడి ఆలయం హిమాలయ పర్వతాల నడుమ ఉంటుంది కాబట్టి అక్కడ శంఖం పూరిస్తే భయంకరమైన ప్రతిధ్వనులు వస్తాయని అక్కడివారి నమ్మకం. శంఖం పూరించాక వచ్చే ప్రతిధ్వని వల్ల అక్కడ కప్పబడిన మంచు కదిలి హిమపాతం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందట. అందుకే అక్కడ శంఖం పూరించేందుకు అనుమతి లేదు.
ఇది ఒక వివరణ అయితే మరో పురాణ వివరణ కూడా ఉంది. చార్‌దామ్‌లో లక్ష్మీదేవి తులసి అవతారంలో ధ్యానం చేస్తుండగా ఆమె ధ్యానానికి భంగం కలిగించాలని చూసిన శంఖాచూడు అనే రాక్షసుడిని విష్ణుమూర్తి వధించాడు. అప్పటి నుంచి ఈ బద్రీనాథుడి ఆలయంలో కానీ ఆలయ పరిసరాల్లో కానీ శంఖాన్ని పూరించడంలేదు.
ఇలాంటి ఆసక్తికరమైన మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆగస్త్య ముని వాతాపి, అతాపి అనే ఇద్దరు రాక్షసులను అంతమొందించాలని చూసినప్పుడు వాతాపి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం శంఖంలో తలదాచుకున్నాడట. ఇక అతాపి అక్కడే ఉన్న మందాకిని నదిలో దూకి తన ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నాడు. దాంతో అక్కడ శంఖం పూరిస్తే మళ్లీ వాతాపి రాక్షసుడు బతికి వస్తాడని అక్కడి భక్తుల విశ్వసిస్తారు. (badrinath)