Spiritual: మతం మారితే ఏం జరుగుతుంది?
Spiritual: చాలా మంది మతాలను మార్చుకుంటూ ఉంటారు. కొందరు నిజంగానే ఇతర మతాల్లో ప్రశాంతత, ఆత్యాధ్మికత ఎక్కువై నమ్మకంతో మారుతుంటారు. మరికొందరు సామాజికంగా లభించే లాభాలపై ఆశతో మారుతుంటారు. అసలు మతం మారవచ్చా? మారితే ఏం జరుగుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.
ముందుగా మనం అప్పర్ నాయనార్ అనే వ్యక్తి గురించి తెలుసుకుందాం. అప్పర్ నాయనార్ శూద్రుల కులంలో పుట్టారు. అప్పర్కి ఓ సోదరి ఉండేది. అప్పర్ తండ్రి చిన్నతనంలోనే వేద వేదాంగాలను అన్నీ నేర్పించారు. నా కుమారుడు ఎలాగైనా సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో రెండు పాషండ మతాలు తయారయ్యాయి. ఆ రెండు మతాల వారు భగవంతుడిని ఆరాధించినా, వేదాలను పఠించినా మేం ఒప్పుకోం అని దాడులు చేసేవారు.
వాళ్లు ఆ కాలంలో రాజులందరినీ ప్రభావితం చేసి వారి ద్వారా ప్రజలను తమ మతాల్లోకి మార్చేసేవారు. అందుకు బాధపడి అప్పర్ తండ్రి అప్పర్ను బ్రహ్మాండంగా తయారుచేస్తారు. దురదృష్టవశాత్తు అప్పర్కు ఎనిమిదేళ్లు వచ్చేసరికి అక్క తిలకవతికి నిశ్చితార్ధం అవుతుంది. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో యుద్ధానికి వెళ్లిన తిలకవతికి కాబోయే భర్త చనిపోతారు. దాంతో అప్పర్ తండ్రి తెగ బాధపడి చనిపోతుండగా.. అమ్మా మీ తమ్ముడు తల్లితండ్రి లేని పిల్లవాడు అయిపోతాడు.. నువ్వే చూసుకోవాలి అని చెప్పి అప్పర్ను తిలకవతికి అప్పజెప్పి కన్నుమూస్తాడు.
తిలకవతి బంధువులంతా నీకు కేవలం నిశ్చితార్థం అయింది కదా.. వివాహం కాలేదు కదా ఇంకొకరిని పెళ్లి చేసుకో అని అంటారు. నిశ్చితార్ధం అయ్యిందంటే ఆ మనిషి తనకు నిశ్చయం అయిపోయినట్లే అని తిలకవతి వారితో చెప్తుంది. ఇంకో పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను అంటుంది. పరమేశ్వరుడి ఆలయంలో కైంకిర్యాలు చేస్తూ బతికేస్తుంది తిలకవతి. అప్పర్ స్నేహితులు మాత్రం అప్పర్ను చెడగొడుతుంటారు. ఎందుకంటే వారు ఇతర మతాలకు చెందినవారు.
అలా అప్పర్ కూడా వారు చెప్పినట్లే వింటుంటాడు. ఓసారి అప్పర్ను ఓ మతం వారు తమ మత పెద్దగా ప్రకటించేస్తారు. అప్పర్కు అప్పట్లో ఇవేవీ తెలిసేవి కావు. కాబట్టి వారినే నమ్ముతుంటాడు. దాంతో అప్పర్ సోదరి తిలకవతి పరమేశ్వరుడి ముందు కూర్చుని కాపాడవయ్యా అంటూ నిరాహార దీక్ష చేసి కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు శివయ్య కలలో కనిపించి నీ సోదరుడిని నీ దగ్గరకు చేరుస్తాను అని మాటిస్తాడు. ఆ సమయంలో అప్పర్కు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు వేరే మతం వారు ఏవేవో చేసి తగ్గించాలనుకుంటారు కానీ అది తగ్గదు. దాంతో అప్పర్ తన అక్కకు కబురుపెడతాడు. నా దగ్గరికి వస్తే తగ్గిస్తాను అంటుంది.
అప్పుడు అప్పర్ తన అక్క ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అప్పుడు తిలకవతి అప్పర్ను నదిలో స్నానం చేయించి ఒళ్లంతా వీబూది పట్టించి శివుడి ముందు కూర్చుపెడుతుంది. అప్పుడు అప్పర్కు కడుపునొప్పి తగ్గుతుంది. మతం మారిపోవడం వల్ల కలిగే పరిణామమే ఇది అని అప్పర్కు తెలిసి అప్పుడు ఆయన దాదాపు ఆరేళ్ల పాటు శివదీక్ష చేపడతాడు.
అంటే.. మతం మారడం అనేది ధర్మానికి వ్యతిరేకం అని ఇక్కడ అర్థం. ఇది ఎవ్వరినీ కించపరిచేందుకు వివరించిన కథ కాదు. ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారికి ప్రకృతే సమాధానం చెప్తుంది అని చెప్పేందుకే ఈ చిన్న వివరణ.