Breakup: బ్రేకప్​ నుంచి బయటపడే మార్గాలు!

Hyderabad: ప్రస్తుతం ప్రేమ బంధాలతోపాటు పెళ్లి బంధాలూ అర్ధంతరంగానే ముగిసిపోతున్నాయి. బంధం ఏదైనా విడిపోయినప్పుడు అది మిగిల్చే బాధ అనంతం. అయితే, బ్రేకప్​ ఆలోచనలతో ఉండిపోతే, వాళ్ల గురించే ఆలోచిస్తే పరిస్థితులు మరింత దిగజారతాయి. శారీరకంగా, మానసింకంగా బలహీనంగా మారిపోతారు. అందుకే బ్రేకప్​ తర్వాత కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు దృఢంగా మలుచుకోవడం తప్పనిసరి. బ్రేకప్​ నుంచి బయటపడేందుకు నిపుణులు ఇచ్చే సలహాలేంటో చూద్దాం..

  • ఇద్దరు వ్యక్తుల మధ్య బ్రేకప్​ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే అస్తమానం జరిగినదానిని తలచుకోవడం, దానికి మీరే కారణమేమో అనే ఆలోచనలతో గడపడం మంచిది కాదు. అవి మిమ్మల్ని ఇంకా క్రుంగదీస్తాయి. మీకు నచ్చినదే మీరు చేశారని దృఢంగా నమ్మాలి.
  • చాలామంది బ్రేకప్​ తర్వాత కూడా మాజీలతో మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల మీ జీవితం మరింత సందిగ్ధంలో పడుతుంది. మళ్లీ వాళ్లకి దగ్గర కావాలనే ఆలోచనలు పెరుగుతాయి. దీనివల్ల సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందువల్ల బ్రేకప్​ తర్వాత వారితో మాట్లాడకపోవడమే మంచిది.
  • చాలామంది బ్రేకప్​ తర్వాత కూడా వారి మాజీలను సోషల్​ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. దీనివల్ల ఉపయోగం లేకపోగా మానసికంగా బలహీనులవుతారు. వారి ఫొటోలు, పరిస్థితిని చూస్తూ అస్తమానం వారి గురించే ఆలోచిస్తూ పనిమీద ధ్యాస పెట్టలేరు. అందువల్ల వారిని అన్​ఫాలో చేయడం, బ్లాక్​లో పెట్టడం మంచిది.
  • బ్రేకప్​ నుంచి బయటపడేందుకు ఉత్తమ మార్గం ట్రావెలింగ్​. నచ్చిన ప్రాంతాల్లో తిరగడం వల్ల మనసు తేలికపడుతుంది. కొత్త పరిచయాలు, స్నేహాల వల్ల జ్ఞాపకాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
  • మీ బంధాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. పోలికల వల్ల మానసికంగా మిమ్మల్ని మీరే తక్కువగా అనుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి, దేనిమీదా మనసు పెట్టలేరు. ఇతరులతో పోల్చుకోకుండా మీ ఆనందం కోసం మీకు ఇష్టమైన పనులు చేయడంపై దృష్టి పెట్టాలి. తద్వారా బ్రేకప్​ బాధ నుంచి బయటపడవచ్చు.