Summer: గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలు
వేసవి కాలం వచ్చిందంటే చాలు పెరిగే ఉష్ణోగ్రతలు, వేడి గాలులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో వేసవిలో ఉష్ణోగ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలకు పైగా నమోదయ్యే ఉష్ణోగ్రతలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తాయి. పెరిగే ఉష్ణోగ్రతల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా గర్భిణీల్లో ఇది మరింత అసౌకర్యంగా ఉంటుంది. గర్భిణీల్లో శరీరం రకరకాల మార్పులకు గురవుతుంది. శిశువుకు అనుగుణంగా శరీరం తనని తాను మలుచుకుంటుంది. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ పరిస్థితిని సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వేసవికాలంలో గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..
* వేసవిలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. గర్భిణీలు 3 నుంచి 5 లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి. ఎక్కువ చక్కెర వాడకుండా తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. కొబ్బరి నీళ్లను తాగడం మంచిది తగినంత హైడ్రేషన్ హీట్ స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి శరీరానికి తగినంత నీటిని అందించాలి.
* ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన సలాడ్లు, పండ్లను ఎక్కువగా చేర్చుకోవాలి. పెరుగు, మజ్జిగ, నిమ్మరసం వంటివి శరీరాన్ని చల్లబరుస్తాయి. అధిక నూనె, నెయ్యి, మసాలాలు వెయ్యకుండా వంటలు చేసుకుంటే మంచిది. ఉప్పు మోతాదు తగ్గించాలి.
* పాదాలను దిండ్లు, కుషన్లపై ఉంచి పడుకోవాలి. కూర్చొనే సమయాల్లోనూ కాళ్లు వేలాడేయకుండా కింద చిన్న పీట వంటి వాటిని వేసుకుంటే మంచిది. ఇలా చేయటం వల్ల పాదాలు, కాళ్లలో నీరు చేరి నడవడానికి కూడా ఇబ్బందిపడకుండా ఉంటుంది. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. శరీర పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ఉండే దుస్తులు, పాదరక్షలను ధరించాలి.
* ఎక్కువ సమయం బయటికి వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లకు వేడి తగలకుండా సన్‌గ్లాసెస్ ఉపయోగించాలి. బయటకు వెళ్ళే సందర్భంలో ఎండ నుండి రక్షణకోసం గొడుగును తీసుకెళ్లడం మంచిది. కనీసం టోపీ అయినా ధరించాలి.
* గర్భిణీలకు తగినంత విశ్రాంతి అవసరం. మధ్యాహ్నం కనీసం 30 నిమిషాలు పడుకోవడానికి ప్రయత్నించాలి. అధిక వేడి ఉన్న సందర్భంలో బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే పడుకుంటే శరీరం చల్లబడుతుంది. అధిక శారీరిక శ్రమచేసేవారిలో, ఎక్కువ గంటలు ఎండకు తిరిగే వారిలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నిర్జలీకరణం, వడదెబ్బ లక్షణాలు కనపడితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి.