లాసిక్ సర్జరీ చేయించుకుంటున్నారా? ఇవి తప్పక తెలుసుకోవాలి
కళ్లజోడు నుంచి పూర్తిగా విముక్తి కలిగించే సర్జరీ లాసిక్. కళ్లకున్న సైట్‌ను జీరో పాయింట్‌కి తగ్గించే సామర్ధ్యం ఉన్న సర్జరీ ఇది. పదేళ్ల క్రితమే ఈ లాసిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సర్జరీల టెక్నాలజీ మారడంతో చాలా మంది దీనిపై మొగ్గుచూపుతున్నారు. అయితే లాసిక్ సర్జరీలు చేయించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నవాళ్లు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
అసలు లాసిక్ ఎవరు చేయించుకోవచ్చు?
- 18 సంవత్సరాలు పైబడినవారు
- కార్నియా పొర మందంగా ఉండాలి
- సంవత్సరం పాటు కళ్లకు ఉన్న సైటులో మార్పులు ఉండకూడదు
- కళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కాని దెబ్బ కాని ఉండకూడదు
- గతంలో ఎటువంటి కంటి సర్జరీలు జరిగి ఉండకూడదు
- HIV, ఎయిడ్స్, రూమటాయిడ్ అథ్రైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉండకూడదు
- ప్రెగ్నెంట్ అయ్యి ఉండకూడదు
40 సంవత్సరాలు పైబడినవారు ఈ లాసిక్ ట్రీట్మెంట్కి అర్హులు కారు. వీరికి అంతగా సర్జరీ అవసరం అనుకుంటే రీఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ లాసిక్ ట్రీట్మెంట్ ఒకసారి చేయించుకుంటే ఇక మళ్లీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, కంటిచూపు బాగుండటానికి కావాల్సిన విటమిన్లు సరిగ్గా అందకపోవడంతో కాస్త సైట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. లాసిక్ తర్వాత కళ్ల ఆకారం కూడా కొంతవరకు మారుతుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కళ్లకు ఇన్ఫెక్షన్, గ్లకోమా వంటివి సోకే అవకాశం కూడా ఉంటుంది.
కళ్లకు లాసిక్ సర్జరీ మొదలుపెట్టే ముందు అనస్థెటిక్ డ్రాప్స్ వేస్తారు. దీనివల్ల సర్జరీ చేస్తున్న సమయంలో నొప్పి తెలియదు. సర్జరీ అయిన కొన్ని గంటల తర్వాత మాత్రం కాస్త కళ్లు లాగుతున్నట్లు నొప్పిగా అనిపిస్తుంది. కళ్ల వెనక నుంచి పిన్నుతో గుచ్చుతున్నట్లు ఈ నొప్పి 24 నుంచి 48 గంటల వరకు ఉంటుంది. సర్జరీ తర్వాత కచ్చితంగా నెల రోజుల పాటు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. అప్పుడే అవి పూర్తిగా కోలుకుంటాయి.
ఈ మధ్యకాలంలో లాసిక్ సర్జరీ వైపు మొగ్గుచూపే వారిలో ఎక్కువ మంది టీనేజ్ అమ్మాయిలే ఉంటున్నారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలకు కళ్లద్దాలు పెట్టుకోవడం అంటే సహజంగానే పెద్దగా ఇష్టం ఉండదు. దాంతో తెలీక 18 ఏళ్లు నిండకుండానే కొందరు తల్లిదండ్రులు లాసిక్ చేయించాలని భావిస్తున్నారు. అయితే లాసిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నవారికి హీలింగ్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరి ఒక్కోలా ఉంటుంది. అందరూ నెల రోజుల్లో కోలుకుంటారని లేదు. అందరికీ ఈ లాసిక్ సూట్ అవ్వాలని లేదు. కొన్ని కేసుల్లో కంటిచూపు పూర్తిగా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కళ్లజోడు పెట్టుకుంటే అందం తగ్గిపోతుందన్న ఒక్క కారణంతో లాసిక్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మరోసారి ఆలోచించాలని అంటున్నారు కంటి వైద్య నిపుణులు.