ఎండాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వాతావరణంలోని మార్పులతో జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఎండలు తీవ్రమయ్యే కొద్ది రకరకాల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఎండాకాలం వచ్చిందంటే పానీయాలను ఎక్కువగా తాగుతారు చాలామంది. అయితే అతిగా ద్రవాహారాలు తీసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. పండ్ల రసాలు తీసుకునేముందు జాగ్రత్తలు వహించాలి.  పగలు వేడి ఉందని.. చల్లని నీటిని తాగుతారు. దీనివల్ల జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఏ సమయంలో అయినా  గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటనే తాగాలి. త‌క్కువ క్యాల‌రీలు ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్లు, కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను మానేయాలి.

కొంతమందికి ఎండకాలంలో జలుబు చేస్తుంది. అది తగ్గాలంటే చాలా రోజులు పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. విట‌మిన్ ఎ, సి ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం ఒక్కటే ఉత్తమ మార్గం. మీ ఆహారంలో పోషకమైన ఆహారాల‌ను చేర్చాలి. రాత్రిపూట‌ తేలికగా జీర్ణం అయ్యే ఆహారాల‌ను తీసుకోవాలి. సలాడ్లు, రసాలు, సూప్, స్మూతీస్ తీసుకోవ‌చ్చు. చెమటతో ఎలక్ట్రోలైట్స్ కోల్పోతారు. శరీరంలో నీటి కొరత వస్తుంది. రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగండి. నీటిని ఎక్కువగా తాగితే.. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరంలో ద్రవాలు తగ్గకుండా ఉంటాయి. నీరు, నిమ్మకాయ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. ఎప్పుడూ లేత రంగు దుస్తులను వేసుకోవాలి. వేసవిలో పాదాలను కూడా రక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో వేప ఆకులు వేసి  ఆ నీటితో స్నానం చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సహజంగా మనిషి రోజుకు 7 నుంచి -8 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా అనిపిస్తే.. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్‌ ధరించాలి. రోజు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా వంటివి తీసుకోవడం మంచిది.

ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లు రోజు మూడు టీ స్పూన్‌ల సబ్జా గింజలను నానబెట్టుకుని తినాలి. గ్లాసులో మూడు వంతుల నీళ్ళను పోసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం క‌ల‌కండ‌ (మిశ్రి ) వేసి ఉదయం నానబెట్టి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆ నీటిని క్రమం తప్పకుండా  తాగితే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో ఉన్న అధిక వేడిని ఇది నివారిస్తుంది. ఉదయాన్నే కలబంద గుజ్జును సన్నగా తరుగుకుని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. నేరుగా తినలేని వారు రుచి కోసం కొంచెం చక్కర కలుపుకుని తినవచ్చు.