ఒంటరితనంతో క్యాన్సర్ ముప్పు!

ఈ ఉరుకులు, పరుగుల జీవన విధానంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒంటరితనం. సెల్​ఫోన్​లు, టీవీల వాడకం పెరిగిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పూర్తిగా తగ్గిపోయింది. ఒకే ఇంట్లో ఉండే మనుషులు కూడా కొన్ని గంటలపాటు మాట్లాడుకోవడం లేదని చెబుతున్నాయి అధ్యయనాలు. దీనివల్ల చాలామందిలో మానసిక ఒత్తిడి పెరిగి ఒంటరితనం సమస్య ఎదురవుతుంది. నిజానికి కొంతమంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఒంటరితనం మంచిది కాదు, అనేక శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఎక్కువ ఒంటరితనం కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీంతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒంటరితనం డిప్రెషన్‌కు దారి తీస్తుంది. డిప్రెషన్ మనిషిని రోజురోజుకు చంపేస్తోంది. కొందరు జీవించాలనే కోరికను కూడా కోల్పోతారు. డిప్రెషన్ తరచుగా ఆత్మహత్యలకు దారితీసే సందర్భాలు అనేకం. డిప్రెషన్ తో వ్యక్తులు జీవితం పట్ల తమ అభిరుచిని కోల్పోతారు. ఒంటరితనం గుండెపోటు ప్రమాదాన్ని 29 శాతం పెంచుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని 32 శాతం పెంచుతుంది. అధ్యయనాలు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. కానీ ఒంటరితనానికి బానిస అయిన వారు సరిగ్గా నిద్రపోలేరు. చింతలు, బాధలు వారిని ముంచెత్తుతాయి. రాత్రంతా మేల్కొని ఉంటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

సామాజిక ఆందోళన రుగ్మత ఉన్న వ్యక్తులు ఇతరులతో కలవడానికి, మాట్లాడటానికి భయపడతారు. ఒంటరితనం మధుమేహానికి కూడా కారణం కావచ్చు. తీవ్రమైన జీవనశైలి సమస్యలు ఉన్నవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందుకే మానసిక ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నలుగురితో నవ్వుతూ ఉంటే.. చాలా రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ఒంటరితనం నుంచి బయటకు రావాలంటే నలుగురితో మాట్లాడాలి. నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. బంధువులు, స్నేహితులతో సాన్నిహిత్యం పెంచుకోవాలి. యోగా, మెడిటేషన్ అలవాటు వల్ల కూడా ఒంటరితనాన్ని జయించవచ్చు. దీనివల్ల ఒంటరితనం దూరమై ధైర్యం, ఏకాగ్రత పెరిగి జీవితంలో ముందడుగు వేసేందుకు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు.