Divorce: ఒక‌రు రాత్రి ఒక‌రు ప‌గ‌లు ప‌నిచేస్తే.. ఎలా క‌లిసుంటారు?

Bengaluru: విడాకులు(divorce) తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న దంప‌తుల‌కు సుప్రీంకోర్టు(supreme court) క్లాస్ పీకింది. ఒక‌రు రాత్రి ఒక‌రు ప‌గ‌లు ప‌నిచేస్తే ఎలా క‌లిసుంటారు? ఆ కాపురం ఎలా నిల‌బ‌డుతుంది? అని మండిపడింది. బెంగ‌ళూరు(bengaluru)కు చెందిన టెకీ దంప‌తులు విడాకులు(divorce) కావాల‌ని పిటిష‌న్ పెట్టుకున్నారు. ఇష్ట‌పూర్వ‌కంగానే విడిపోవాల‌ని అనుకుంటున్నార‌ని, భ‌ర‌ణం కింద భ‌ర్త 12 ల‌క్ష‌లు ఇస్తాన‌ని రాసిచ్చార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టు బెంచ్‌కి రావ‌డంతో న్యాయ‌మూర్తులు వారికి చీవాట్లు పెట్టారు. “మీరిద్ద‌రూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. బెంగ‌ళూరులో పోస్టింగ్ ప‌డింది. ఒకరు రాత్రి ప‌నికి వెళ్తే ఇంకొక‌రు ప‌గ‌లు వెళ్తారు. మ‌రి అలాంట‌ప్పుడు మీరెలా క‌లిసుంటారు? విడాకులు తీసుకుంటున్నందుకు బాధ‌ప‌డ‌ట్లేదు కానీ పెళ్లి చేసుకున్నందుకు బాధ‌ప‌డుతున్నారా? ఇంకోసారి ఆలోచించి చూడండి. క‌లిసుండేందుకు ప్ర‌య‌త్నించండి. అప్ప‌టికీ మీ మ‌న‌సులు మార‌క‌పోతే మీ ఇష్టం. బెంగ‌ళూరులో అంత సులువుగా విడాకులు తీసుకోరు” అని న్యాయ‌మూర్తులు స‌ర్దిచెప్పారు.