Spiritual: పూజా గ‌దిలో ఇవి ఉంటే అరిష్ట‌మా?

Spiritual: మ‌న శ‌రీరానికి గుండె ఎంత అవ‌స‌ర‌మో.. ఇంటికి పూజ గ‌ది కూడా అంతే కీల‌కం. ఇప్ప‌ట్లో కొత్త‌గా అపార్ట్‌మెంట్స్ వ‌స్తున్నాయి. ఎక్క‌డా పూజ గ‌దులు ఇవ్వ‌డంలేదు. పూజా గ‌ది అనేది ఇంట్లో చాలా కీల‌కం. ఎందుకంటే.. హాల్లో కూర్చుంటాం.. కిచెన్‌కి ఒక ప‌రిధి ఉంది.. బెడ్‌రూంలు, బాత్రూమ్‌ల‌కు ప‌రిధులు ఉన్నాయి. కానీ ఆత్మ చైత‌న్యాన్ని ఇంట్లో ఎన‌ర్జీ వ‌చ్చేది పూజ గ‌ది నుంచే. తెలుగు రాష్ట్రాల్లోని చాలా హిందువుల ఇళ్ల‌ల్లో పూజ గ‌దులు ఉంటాయి. కానీ క‌ర్ణాట‌క‌లోని కొన్ని ప్ర‌దేశాల్లో మాత్రం పూజా గ‌దినే ఓ ఆల‌యంలా క‌ట్టుకుంటారు. భ‌గ‌వంతుడి త‌త్వం మ‌న ఇంట్లో ఎప్పుడూ ఉండాలి. ఏ ఇంట్లో దీపం ఉండ‌దో.. ఆ ఇంట్లో ద‌రిద్రం తాండ‌విస్తుంది. ఏ ఇంట్లో అయితే దీపం ఉండ‌దో ఆ ఇంట్లో ల‌క్ష్మీదేవి స‌న్నిధానం ఉండ‌దు.

అయితే ఆ దీపం ప్ర‌శాంత ప్ర‌దేశంలో ఉండాలి. అంటే పూజా గ‌ది. ఎందుకంటే దేవుళ్లు, దేవ‌త‌లు అక్క‌డే ఉంటారు. ఆ పూజా గ‌ది ఉండాల్సింది తూర్పు వైపు కానీ లేదా ప‌శ్చిమ దిశ‌లో అయినా ఉండాలి. వేరే చోటు ఉండ‌కూడ‌దు. ఉత్త‌రం వైపు, ఉత్త‌ర ఈశాన్య భాగంపై పెట్టుకుంటే ఫ‌ర్వాలేదు. వాస్తు ప్ర‌కారం ఉచ్ఛ, నీచ భాగాలు ఉంటాయి. మ‌న శరీరంలో శిర‌స్సు నుంచి నాభి వ‌ర‌కు ఉచ్ఛ భాగం. నాభి నుంచి కింది వ‌ర‌కు నీచ భాగం అంటారు. అలాగే.. ఈ వాస్తులో కూడా ఆజ్ఞేయం మొద‌లుకుని.. వాయువ్యం వ‌ర‌కు ఉచ్ఛ భాగం.. ద‌క్షిణం, నైరుతి భాగాలు నీచ భాగాలు. అందుకే టాయ్‌లెట్లను నీచ భాగాల్లోనే క‌ట్టుకుంటారు.  (Spiritual)

పూజా గ‌ది ఎలా ఉండాలి?

పూజా గ‌దిలో మీకు న‌చ్చిన చిత్ర ప‌టం ఒక‌టి ఉండాలి. అలాగ‌ని వికృత‌మైన చిత్ర‌ప‌టాల‌ను పెట్ట‌కూడ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు శ్రీకృష్ణుడు ర‌తిక్రీడ‌లు ఆడుతున్న ఫోటోలు ఉంటాయి. ఇలాంటి ఫోటోను దేవుడి గ‌దిలో పెట్ట‌కూడ‌దు. ఇలాంటి ఫోటోలు బెడ్‌రూంలో పెట్టుకోవాలి. క‌డుపు చీలుస్తున్న‌ట్లుగా క‌నిపించే ఉగ్ర న‌ర‌సింహ ఫోటోల‌ను కూడా పెట్టుకోకూడ‌దు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మ‌రో విష‌యం ఏంటంటే.. దేవుళ్ల ఫోటోల ప‌క్కన గురువుల ఫోటోల‌ను పెడుతుంటారు. ఇలాంటివి పెట్ట‌కూడ‌దు. క‌చ్చితంగా ఓ రాగి పాత్ర‌లో నీటిని పోసి రోజూ తాజా పూలు ఉంచాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు కూడా పోతాయి.