Dharma Sandehalu: వితంతువులు బొట్టు పెట్టుకోవచ్చా?
Dharma Sandehalu: ఈ మధ్యకాలంలో భర్తలు చనిపోయిన కొందరు స్త్రీలు బొట్టు పెట్టుకుంటూ, పువ్వులు, గాజులు వేసుకుంటూ సంపూర్ణ ముత్తైదుల్లా దర్శనమిస్తున్నారు. ఒకప్పుడు భర్త చనిపోతే శిరోముండనం చేసి తెల్ల చీర కట్టుకోమని చెప్పేవారు. క్రమేణా ఆ ఆచారం పోయింది. అసలు వితంతువు బొట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏమన్నా సమస్యలు వస్తాయా?
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. శాస్త్రం వేరు. ఆచారం వేరు. ఆచరిస్తూ వచ్చేది ఆచారం. శాస్త్రంలో రాసింది పాటించడం వేరు. ఆడపిల్లలు పుట్టాక ఒక నెల రోజులకో రెండు నెలలకో తల్లి బొట్టు పెట్టడం, గాజులు వేయడం వంటివి చేస్తుంది. పెద్దయ్యే కొద్ది పువ్వులు కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ ఆడపిల్లకు చిన్నప్పటి నుంచి అలవాట్లే. ఈ అలవాట్లను మధ్యలో వివాహం చేసుకున్న వ్యక్తి చనిపోతే ఆపేయాల్సిన అవసరం లేదు. అలా ఆపేయాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు.
మరి ఎందుకు వితంతువులు తెల్ల చీరలు కట్టుకోవడం, శిరోముండనం చేసుకోవడం వంటివి చేస్తుంటారంటే.. ఒకప్పుడు యుద్ధాల్లో యువ సైనికులు ఉండేవారు. అప్పటి కాలంలో ఎక్కువగా యువకులనే సైన్యంలో చేర్చుకునేవారు. వారు యుద్ధాల్లో చనిపోయినప్పుడు వారి భార్యలు కూడా యవ్వనంలో ఉన్నారు కాబట్టి వారిపై ఎవరైనా కన్నేసినా.. లేదా వారే ఇతర మగవారికి లొంగిపోవడం.. అక్రమ సంబంధాలు ఉండటం వంటివి జరగకుండా అందమైన వారి ముఖాన్ని ఎవ్వరూ చూసేందుకు వీలుగా లేకుండా చేసేందుకే ఈ వితంతువు ఆచరణ మొదలైంది. అంతే తప్ప శాస్త్రాల్లో మాత్రం ఎక్కడా రాసి లేదని పెద్దలు చెప్తున్నారు.