Reverse Walking: వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Hyderabad: సంపూర్ణ ఆరోగ్యానికి వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం చెయ్యడం వల్ల రోజంతా శరీరంతోపాటు మనసుకూ ఉల్లాసంగా ఉంటుంది.  ఉదయపు నడక ఆరోగ్యానికి చాలా మంచి వ్యాయామం. నిద్రలేచిన తర్వాత వ్యాయామానికి ముందు కొన్ని నిమిషాలు నడవడం వల్ల శరీరానికి చాలా మంచి మేలు జరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు నడవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అయితే సాధారణ నడక కంటే వెనక్కి నడవడం(Reverse Walking) ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఇక ఈ రివర్స్ వాకింగ్‌లో అడుగులు వెనుకకు వేయడం ఏకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఆటలా అనిపించే ఈ వ్యాయామం శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుందంటున్నారు.
ఈరోజుల్లో చాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. నడిచేటప్పుడు మోకాళ్లపై ఒత్తిడి వల్ల ఈ నొప్పి మరింత ఎక్కువవుతుంది. రివర్స్​ వాకింగ్​ వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు దీని వల్ల వెన్ను నొప్పి కూడా తగ్గుతుంది. రివర్స్ వాకింగ్ కాళ్లలోని కండరాలను బలపరుస్తుంది. వెనక్కి నడవడం వల్ల కండరాలు ఎక్కువగా సాగుతాయి. సరదా ఆటగా సాగే ఈ వ్యాయామంతో మానసికంగానూ దృఢంగా తయారవుతారట. వెనక్కి నడవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందటున్నారు నిఫుణులు.