చెట్టు నుంచి మనిషికి ఇన్‌ఫెక్షన్.. భారత్‌లో తొలి కేసు!
కోవిడ్ కారణంగా ఇప్పటికే అల్లాడిపోయిన భారత్.. మెల్లిగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో మరో ఇన్‌ఫెక్షన్ ఒకటి దాపరించింది. ఓ కొత్త రకమైన ఇన్‌ఫెక్షన్ ఇండియాలోకి ప్రవేశించింది. అది మొక్క నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఈ తొలి కేసు నమోదైంది. ఆ ఇన్‌ఫెక్షన్ కాండోస్ట్రెనియం పర్పూరియం అనే మొక్క ఫంగస్ నుంచి వచ్చిందట. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి ఇన్‌ఫెక్షన్ సోకడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. దాంతో పశ్చిమ బెంగాల్ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి వయసు 61 సంవత్సరాలు. సైన్స్ డైరెక్ట్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి ప్లాంట్ మైకాలజిస్ట్. అతను వృత్తి రిత్యా మొక్కలు, చెట్లకు సోకే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లపై స్టడీ చేస్తుంటారు.
మూడు నెలలుగా గొంతు మారడం, విపరీతమైన దగ్గు, నీరసం, ఆహారం మింగడం కష్టంగా అనిపిస్తుండడంతో వైద్యులను సంప్రదించాడు. అతనికి డయాబెటిస్, హెచ్ ఐవి, కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటివి ఏమీ లేవని వైద్యులు తెలిపారు. కుళ్లిపోయిన మొక్కల పదార్థాలు, చెట్ల దగ్గర మొలిచే పుట్టగొడుగులపై దీర్ఘకాలంగా రీసెర్చ్ చేస్తున్నందున అతనికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. మొదట అతను వైద్యులను సంప్రదించినప్పుడు అసలు సమస్య ఏమై ఉంటుందో వైద్యులకు కూడా అర్థంకాలేదు. శరీరం మొత్తం సీటీ స్కాన్ చేయగా మెడ దగ్గర ఏదో ఇన్‌ఫెక్షన్‌లా సోకినట్లు తెలిసింది. ఆ ఇన్‌ఫెక్షన్ నుంచి కారుతున్న చీమును సేకరించి టెస్టులకు పంపించారు. ఫలితాల్లో అది మొక్క ఫంగస్ నుంచి సోకిన ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించారు. ఇలాంటి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సాధారంగా గులాబీ మొక్కలకు సోకుతుంటాయి. కానీ ఆ ఇన్‌ఫెక్షన్ మనిషికి సోకడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి వారం రోజుల్లో కోలుకున్నాడు. అది మళ్లీ సోకే ఛాన్సులు తక్కువేనని వైద్యులు వెల్లడించారు.