నెల రోజులుగా పార్టీ.. యువకుడికి పక్షవాతం!
పార్టీల పేరుతో పీకల దాకా తాగి అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు నేటి యువత. ఈ మధ్యకాలంలో పార్టీల్లో మందు, సిగరెట్లే కాకుండా డ్రగ్స్ కూడా సేవించేస్తున్నారు. ఒక్కరోజు పార్టీలో మందు తాగితేనే హ్యాంగ్ ఓవర్ లాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటిది ఓ యువకుడు ఏకంగా నెల రోజుల పాటు రోజూ పార్టీ చేసుకుంటూనే ఉన్నాడు. దాంతో అతను తాత్కాలిక పక్షవాతానికి గురయ్యాడు.
ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. అలెక్స్ అనే 28 ఏళ్ల కుర్రాడికి లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో బతకాలన్నది కోరిక. అతను స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచి పాపులర్ అయిపోవాలని తన తోటి వాళ్లు తనను చూసి మెచ్చుకోవాలని ఆరాటపడుతుండేవాడు. ఇతను ఇంగ్లాండ్‌లోని లివర్ పూల్ సిటీ సెంటర్‌లో పనిచేస్తూ ది కవేజ్ అనే బ్యాండ్‌లో కూడా పెర్ఫాం చేస్తుంటాడు. అతను కోరుకున్న లగ్జరీ లైఫ్‌స్టైల్‌లో భాగంగానే పబ్బులకు, పార్టీలకు విపరీతంగా వెళ్తూ.. డ్రగ్స్, మద్యానికి అలవాటుపడ్డాడు. దాంతో అతను తాత్కాలిక పక్షవాతానికి గురయ్యాడు. తన ఆరోగ్యం పాడవడానికి ఒక కారణం మద్యం, డ్రగ్స్ అయితే మరో కారణం తన స్నేహితులేనని చెప్పి బాధపడ్డాడు. ఇంత జరిగినా తన ఫ్రెండ్స్ అసలు చూడటానికి రాలేదని వచ్చినవారు ఇది అంతా జస్ట్ ఫన్ ఏం కాదు అని ఏదో మాటవరుసకు చెప్పి వెళిపోతుండేవారని అన్నాడు. ఒక 8 నెలల పాటు మద్యానికి దూరంగా ఉంటూ వైద్యం తీసుకోవడంతో పక్షవాతం నుంచి కోలుకోగలిగాడు. 8 నెలల తర్వాత కూడా మళ్లీ మనసు పార్టీల వైపు లాగుతుండడంతో ఎలాగైనా తనని తాను మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
ఇలాగే ఉంటే ఎక్కడ తన తల్లి నుంచి దూరం అవ్వాల్సి వస్తుందోనని భయపడి కాస్త కష్టమే అయినా అలెక్స్ ఓ క్రూజ్ లైనర్‌లో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి తనలాగే మద్యానికి, డ్రగ్స్‌కి అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారి కోసం ఏదైనా చేయాలని చెప్పి ఓ లైఫ్‌స్టైల్ కమ్యూనిటీని కూడా స్థాపించాడు. ఒంటరిగా తమ జీవితాలతో పోరాడుతూ బతికే వారికి తానొక అవకాశాం ఇస్తానని, ఏ సమస్యైనా ఉంటే తనతో పంచుకోవాలని కోరుతున్నాడు.