పేపర్​ ప్లేట్లు, గ్లాసుల్లోనూ విషం..!

ప్లాస్టిక్​ కవర్లు, కప్పులు, బాటిళ్లు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​తో తయారయ్యే ఇవి వందల సంవత్సరాలపాటు మట్టిలో కలిసిపోకుండా భూమిని కలుషితం చేస్తాయి. అందుకే పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్​ వస్తువులను వాడటం తగ్గించి అందరూ పేపర్లు, వెదురుతో చేసిన వస్తువుల వాడకంపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల్లో ఈ విషయంపై అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇటీవల అంతర్జాతీయ విద్యావేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడయ్యాయి. పేపర్ బ్యాగులు, బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్ లో మానవ ఆరోగ్యం, పర్యావరణం రెండింటికీ హాని కలిగించే టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయని నిర్ధారించారు పరిశోధకులు.

సాధారణంగా ఫిజ్జాలు, బర్గర్‌లు, ఫ్రై ఫుడ్స్​ను నిల్వవుంచేందుకు , ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకువెళ్ళేందుకు పేపర్ బ్యాగులు, బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్‌ ను ఉపయోగిస్తారు. అయితే వీటిలోనూ ప్రమాదకర కారకాలు ఉన్నాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పేపర్ బ్యాగ్‌లు, బయోడిగ్రేడబుల్ ఫుడ్ కంటైనర్‌లపై నిషేదం ఉన్నప్పటికీ చాలా మంది వాటిని ఉపయోగిస్తున్నారు. పలు రకాల ఆహారపదార్ధాలను వాటిలోనే నిల్వ ఉంచుతున్నారు. పెర్ ఫ్లోరోక్టానోయిక్ సల్ఫేట్ సింధటిక్ సమ్మేళనాలలో ఒకటి. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీలో దీనిని చేరుస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ కంటైనర్ లు, రేపరులలో కాగితపు గ్రీజు నిరోధకత కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. ఇవి మానవ జీర్ణ వ్యవస్థతో పాటు నాడీ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

ఈ సమ్మేళనాలు నెమ్మదిగా క్షీణిస్తాయి. పర్యావరణం, మానవ కణజాలంలో, ముఖ్యంగా కాలేయంపై ప్రభావాన్ని చూపిస్తాయి. కెనడా, యుఎస్ మరియు స్విట్జర్లాండ్‌ల పరిశోధకులు 42 రకాల పేపర్ ఫుడ్ ప్యాకేజింగ్‌లను పరిశీలించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారు పరిశీలించిన వాటిలో బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్, శాండ్‌విచ్, బర్గర్ రేపర్లు, పాప్‌కార్న్ సర్వింగ్ బ్యాగ్‌లు, డోనట్స్ వంటి స్వీట్‌ల కోసం ఉపయోగించే బ్యాగ్‌లు ఉన్నాయి. అయితే మనం ఎక్కువగా వాడే పేపర్​ టీ కప్పులు, ప్లేట్లు, జ్యూస్​ గ్లాసుల్లోనూ ఇవే హానికారక పదార్థాలను కలిపి తయారు చేస్తారు.
ఈ ఫుడ్​ ప్యాకేజింగ్‌ బ్యాగులను విశ్లేషించగా, 45 శాతం నమూనాలలో ఫ్లోరిన్ ఉందని కనుగొన్నారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో నివేదించిన పరిశోధనలు, బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్ , హాంబర్గర్‌లు, పేస్ట్రీలు , డోనట్స్‌తో సహా జిడ్డుగల ఆహారాలకు ఉపయోగించే పేపర్ బ్యాగ్‌లలో ఫ్లోరిన్, పిఎఫ్‌ఎఎస్ అత్యధిక సాంద్రతలు ఉన్నాయని వెల్లడిస్తున్నాయి.

ఈ అధ్యయనాల ప్రకారం పెర్ ఫ్లోరోక్టానోయిక్ అనేది ప్యాకేజింగ్ పేపర్​, బ్యాగ్ ల నుండి ఆహారంలోకి చేరుతుంది. ఆహారం వేడి , నూనెగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ కారకాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడం, ఇమ్యునోలాజికల్ పనితీరు, సంతానోత్పత్తిని తగ్గటం, జీవక్రియ, ఊబకాయం పెరిగే ప్రమాదం, జంతువులలో అనేక ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు కారణమవుతుంది. ఈ అధ్యయనాల ప్రకారం పేపర్​తో చేసిన వస్తువులకంటే వెదురుతో చేసిన వస్తువులను వాడటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వెదురుతో చేసిన ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు.. ఇలా అన్ని రకాల వస్తువులూ అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజింగ్​ సామాగ్రినీ వెదురుతో తయారు చేసేందుకు రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.