Vinayaka Chavithi: లాల్‌బౌగ్చా మ‌హ‌రాజ్ విశిష్ట‌త‌..!

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రికీ వినాయ‌క చ‌వితి (vinayaka chavithi) అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడెప్పుడు బొజ్జ గ‌ణ‌ప‌య్య ఇంటికి వ‌స్తాడా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుంటాం. రోజూ గ‌ణ‌నాథుడి విగ్ర‌హాల‌కు పూజ‌లు చేస్తూ.. పాట‌లు పెట్టి డ్యాన్సులు వేస్తూ.. దాదాపు 11 రోజుల ఘ‌నంగా ఈ పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఈరోజు వినాయ‌క చ‌వితి పుర‌స్క‌రించుకుని ముంబైలో ఎంతో ఫేమ‌స్ అయిన లాల్‌బౌగ్చా రాజా (lalbaugcha raja) విశిష్ట‌త గురించి తెలుసుకుందాం.

మ‌న‌కు తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో ఖైరాతాబాద్ గ‌ణేష్ (khairtabad ganesh) ఎంత ఫేమ‌సో ముంబైలో లాల్‌బౌగ్చా రాజా అంత ఫేమ‌స్. ఖైర‌తాబాద్‌లో ప్ర‌తి వినాయ‌క చ‌వితి అతి భారీ విగ్ర‌హాన్ని అప్ప‌టిక‌ప్పుడు త‌యారుచేస్తుంటారు. లాల్‌బౌగ్చా గ‌ణేష్‌ విగ్రహం కూడా అంతే. ప్ర‌తి సంవ‌త్స‌రం 18 నుంచి 20 అంగుళాలు ఉండే విగ్ర‌హాన్ని త‌యారుచేస్తుంటారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ఉన్న లాల్‌బౌగ్ అనే ప్రాంతంలో ఈ గ‌ణ‌నాథుడి మండ‌పం ఉంది. ఈయ‌న్ను లాల్‌బౌగ్చా రాజా అని పిలుస్తారు. అంటే లాల్‌బౌగ్‌కి రాజు అని అర్థం. ఇక్క‌డ గ‌ణ‌నాథుడి విగ్ర‌హం కూడా రాజ‌వారు సింహాసనాన్ని అధిష్టినట్లుగానే ఉంటుంది.

చ‌వితి రోజున వినాయ‌కుడు జ‌న్మించాడు కాబ‌ట్టి వినాయ‌క చ‌వితి జ‌రుపుకుంటాం అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. చ‌తుర్ధ‌సి రోజున నిమ‌జ్జ‌నం చేస్తాం. నిమ‌జ్జనం అయ్యేవ‌ర‌కు 11 రోజుల పాటు లాల్‌బౌగ్చా గ‌ణ‌నాథుడు ద‌ర్శ‌నం ఇస్తారు. ఈ ప‌ది రోజుల్లో దాదాపు 15 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు లాల్‌బౌగ్చా రాజాను ద‌ర్శించుకుంటారు. ఈయ‌న్ను న‌వ‌సాచ గ‌ణ‌ప‌తి అని కూడా పిలుస్తారు. అంటే అన్ని కోరిక‌లు నెర‌వేర్చేవాడు అని అర్థం. ఇక్క‌డ వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 19 నుంచి ప్రారంభం కానున్నాయి. (vinayaka chavithi)

ఆస‌క్తిక‌ర అంశాలు

*1934లో లాల్‌బౌగ్ మార్కెట్‌కి చెందిన కోలి సంఘం మ‌త్య్స‌కారులు సార్వ‌జ‌నిక్ గ‌ణేష్ మ‌హోత్స‌వ్ మండ‌ల్‌ను స్థాపించారు. ఇప్పుడున్న లాల్‌బౌగ్ మార్కెట్ ఎంతో అభివృద్ధి చెందింది. కానీ 1934లో ప‌రిస్థితి వేరేలా ఉండేది. ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకే కోలి సంఘం మ‌త్య్స‌కారులు ఈ మండ‌ల్‌ను స్థాపించారు.

*స్వాతంత్ర్య స‌మ‌రం క్షేత్రస్థాయిలో జ‌రుగుతున్న‌ స‌మ‌యంలో ఈ మండ‌ల్‌ను స్థాపించారు. అప్ప‌టినుంచి ఏం అడిగినా అది లాల్‌బౌగ్చా మ‌హ‌రాజ్ నెర‌వేరుస్తాడ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

*మొద‌టి లాల్‌బౌగ్చా మ‌హ‌రాజ్ విగ్ర‌హాన్ని ర‌త్నాక‌ర్ కాంబ్లి అనే వ్య‌క్తి రూపొందించారు. దాదాపు 80 ఏళ్ల పాటు కాంబ్లి కుటుంబీకులు విగ్ర‌హ బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు.

*ప్ర‌తి సంవ‌త్స‌రం వినాయ‌క చవితికి కాంబ్లి ఆర్ట్స్ స్టూడియోలో 18 నుంచి 20 అంగుళాల లాల్‌బౌగ్చా రాజాను నిర్మిస్తారు. విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌ను కూడా అక్క‌డి సంప్ర‌దాయం ప్ర‌కార‌మే చేస్తారు.

*గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకునేందుకు రెండు దారులు ఉంటాయి. ఒక ద‌ర్శ‌న దారిని న‌వ‌సాచి అని రెండో ద‌ర్శ‌న దారిని ముఖ్ ద‌ర్శ‌నాచి అని పిలుస్తారు. న‌వ‌సాచి దర్శ‌నం అంటే స్టేజ్‌పైకి ఎక్కి మ‌హ‌రాజ్ పాదాల‌ను తాకే అవ‌కాశం ఉంటుంది. ముఖ్ ద‌ర్శ‌నాచి అంటే దూరం నుంచే మొక్కుకునే వీలు ఉంటుంది.

*దాదాపు 80 ఏళ్ల చ‌రిత్ర ఉన్న లాల్‌బౌగ్చా గ‌ణేష్ ఉత్స‌వాలు మొద‌టిసారి 2020లో నిలిపివేయాల్సి వ‌చ్చింది. కోవిడ్ కార‌ణంగా లాక్‌డౌన్ అవ్వ‌డంతో ఉత్స‌వాలు నిర్వ‌హించ‌లేదు.

*భార‌త‌దేశంలోనే అతిపెద్ద నిమ‌జ్జ‌న ఉత్స‌వం లాల్‌బౌగ్చా మ‌హ‌రాజ్‌కు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10 గంట‌ల‌కు నిమ‌జ్జనం మొద‌ల‌వుతుంది. మ‌రుస‌టి రోజు రాత్రి స‌ముద్రంలో నిమ‌జ్జ‌నం చేస్తారు. (vinayaka chavithi)