Raksha Bandhan: తోబుట్టువులు లేరా..ఏం పర్వాలేదు..!
రాఖీ పౌర్ణమి (raksha bandhan) రోజున అక్క చెల్లెళ్లు తమ అన్నదమ్ములతో కలిసి సరదాగా పండుగను జరుపుకుంటారు. రాఖీ కట్టి తమ ప్రేమను చాటిచెప్పి.. వారికి స్వీట్స్ తినిపించి గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే రాఖీ కట్టడానికి అన్నదమ్ములు లేకపోతే ఎలా? ఏం పర్వాలేదు. ఇలా చేసి చూడండి. రాఖీ అంటే అన్నకి లేదా తమ్ముడికి.. ఎల్లప్పుడూ నన్ను సంరక్షిస్తూ ఉండూ అనే భరోసాని ఇవ్వమని కోరుతూ చేతికి కట్టే దారం. మరి సోదరులు లేని ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అదే విధంగా.. రాఖీ కట్టేందుకు అక్కా చెల్లెళ్లు లేనివారి పరిస్థితేంటి? (raksha bandhan)
వారు లేకపోతే ఏంటి.. ఫ్రెండ్స్, కజిన్స్, మనల్ని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునే గార్డియన్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా రాఖీ కట్టచ్చు. కేవలం అన్నదమ్ములకే కట్టాలని, అక్కా చెల్లెళ్లే కట్టాలన్న నియమం ఏమీ లేదు. ఇక ఏ ఆప్షన్ లేకపోతే.. ఏదైనా అనాథాశ్రమానికి వెళ్లండి. అక్కడ ఎంతో మంది అనాథ పిల్లలు వేల కళ్లతో ఇలాంటి పండుగలు జరుపుకోవాలని చూస్తుంటారు. వారికి రాఖీ కట్టడమో లేదా వారి చేసే రాఖీ కట్టించుకోవడమో చేయండి. వారికి స్వీట్స్, చాక్లెట్స్, గిఫ్ట్స్ ఇచ్చి చూడండి. ఆ రోజంతా మీకు ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది.
ఇక ఆ ఆప్షన్ కూడా లేకపోతే.. మీ ఇంట్లో మొక్కలకు, బయట నీడ, గాలి ఇచ్చే చెట్లకు రాఖీ కట్టండి. అందులో ఏ తప్పూ లేదు. అవి కూడా మనల్ని ఏదో ఒక రకంగా సంరక్షిస్తున్నాయి కదా..! ఇక అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు ఉన్నప్పటికీ.. వారు వేరే ప్రదేశాల్లో ఉండి రాఖీ కట్టడం వీలు కాకపోతే వర్చువల్ రాఖీలు కూడా కట్టచ్చు. ఉద్యోగాలు, చదువుల కోసం కుటుంబానికి దూరంగా ఉంటున్న మీ తోబుట్టువులకు వీడియో కాల్ కానీ ఫోన్ కాల్ కానీ చేసి మనసారా కబుర్లు చెప్పినా ఎంతో ఆనందంగా ఉంటుందని తెలియజేసుకుంటూ.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. (raksha bandhan)