Tirumala లో ఈ 4 తప్పులు అస్సలు చేయకండి
Tirumala: చాలా మంది అయ్యో నేనెంతో తిరుమలకు వెళ్లాను.. కాలి నడకన వెళ్లాను.. అయినా సరే నా కష్టం తీరలేదు అని అంటుంటారు. సామాన్యంగా తిరుమల లాంటి యాత్రలు చేసినప్పుడు మనం పాటించాల్సినవి కొన్ని ఉంటాయి. అవి చేయకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం. అందుకే కోరుకున్నది జరగదు. యాత్ర ఫలితం లభించదు. తిరుమలలో మనం చేయకూడని నాలుగు తప్పులేంటో తప్పక తెలుసుకోవాలి. అవేంటంటే..
గురువుని దర్శించకుండా శ్రీవారి దర్శనం
తిరుమలలో చాలా మంది చేసే తప్పుల్లో మొదటి తప్పు ఇదే. గురువు అయిన వరాహ స్వామిని దర్శించుకోకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లిపోతారు. ఇది చాలా పెద్ద తప్పు. అసలు తిరుమల వెంకటేశ్వరుని క్షేత్రం కాదు. వరాహ క్షేత్రం. వరాహ స్వామి శ్రీవారి వద్ద ఉండటానికి అనుమతి తీసుకుంటున్నప్పుడు శ్రీవారికి మూడు ప్రమాణాలు చేసారు. మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం.. ఈ మూడు నీకు ఇస్తాను అని వాగ్దానం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసిచ్చారు. (Tirumala)
ఇప్పటికీ ఆ ప్రమాణ పత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మ్యూజియంలో ఉంది. వరాహ స్వామి దేవాలయంలోనే ఉండేది ఆ తర్వాత దానికి మ్యూజియంకు తరలించారు. అందులో స్వామి చెప్పిన మొదటి రెండు పనులను అర్చకులు ఇప్పటికీ చేస్తున్నారు. మొదటి పూజ రోజూ వరాహ స్వామికే చేస్తారు. మొదటి నైవేద్యం కూడా వరాహ స్వామికి పెట్టే ఆ తర్వాత శ్రీవారికి పెడతారు. కానీ మొదటి దర్శనం పాటించాల్సింది మాత్రం భక్తులే. కానీ భక్తులు మాత్రం ఇది పాటించకుండా నేరుగా శ్రీవారి వద్దకే వెళ్లిపోతుంటారు.
ALSO READ: Evil Eye: వీటితో నరఘోష తొలగిపోతుంది
లౌకిక సుఖాల కోసం అస్సలు వద్దు
ఇక తిరుమలలో తెలిసో తెలీకో చేసే రెండో తప్పు ఏంటంటే.. కొందరు లౌఖిక సుఖాల కోసం వెళ్తుంటారు. పొరపాటున కూడా ప్రాపంచిక సుఖాలను అనుభవించేందుకు వెళ్లకూడదు. అంటే.. హనీమూన్ ట్రిప్స్, బోర్‌గా ఉందని సరదాగా ట్రిప్స్‌కి వెళ్లడానికి తిరుమల ఏమీ పర్యాటక క్షేత్రం కాదు. మహా పుణ్య క్షేత్రం. అందుకే మన పెద్దలు శాస్త్రంలో ఒక నియమం పెట్టారు. వివాహం అయితే ఆరు నెలల పాటు ఎలాంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లకూడదు అని. మనలో చాలా మందికి ఈ విషయం తెలీదు. పెళ్లైన కొన్ని నెలల పాటు ఆ వ్యామోహాన్ని తీర్చుకోవడానికి వెళ్తారన్న ఉద్దేశంతోనే ఈ నియమం పెట్టారు. శ్రీవారికి పద్మావతితో వివాహం అయ్యాక ఆరు నెలల పాటు ఆయన కొండకి రాలేదు. కొండ కింద అగస్త మహర్షి ఆశ్రమం ఉంటే అక్కడ ఉండి ఆరు నెలల పోయాక కొండ మీదకు వచ్చారు. మరి స్వామివారు పాటించినప్పుడు మనమెంత పాటించాలి చెప్పండి?
మోసాలతో దర్శనాలు వద్దు
పొరపాటున కూడా మోసాలతో దర్శనాలు వద్దు. దేవస్థానం వారు పెట్టినవి పాటిస్తే మంచిది. ఒకసారి దర్శనం అయ్యాక మళ్లీ మూడు నెలల పాటు దర్శనం చేసుకోవడం కుదరదు. ఎందుకంటే దాని వల్ల అందరికీ దర్శనం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈ రూల్ పెట్టారు. కానీ కొందరు టెక్నాలజీని వాడుకుని ప్రతి నెలా దర్శనానికి వెళ్తున్నారు. ఇది చాలా తప్పు కదా..! ఎప్పుడూ కూడా ఇలాంటి దొంగ దర్శనాలు చేయకండి. చక్కగా శ్రీవారి దర్శనం నిబంధనలను ఫాలో అయ్యి చేసుకోండి.
పూలు పెట్టుకోకూడదు.. చెప్పులు ధరించకూడదు
మీరు గమనించినట్లైతే.. కొండపై దర్శనానికి వచ్చే ఆడవాళ్లు జడలో పువ్వులు అస్సలు పెట్టుకోరు. అలా పెట్టుకోవడానికి వీల్లేదు కూడా. ఒకవేళ పెట్టుకున్నా అక్కడి సిబ్బంది లాగి పడేస్తారు. మరో విషయం ఏంటంటే.. పొరపాటున కూడా చెప్పులు వేసుకుని పాదరక్షలతో తిరగకూడదు. ఎందుకంటే కొండ మొత్తం సాలిగ్రామ శిలతో ఉంటుంది. మాడ వీధుల్లో చెప్పులతో నిలబడి వేరే వాళ్లతో మాట్లాడకూడదు. ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఆలయానికి చుట్టూ ఉన్న వీధులు పరమ పవిత్రమైనవి.