Anantapur: ‘అనంత’ ఖనిజాలు కలిగిన ‘పురం’ అట..!
రాయలసీమను శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంలో రత్నాలను, వజ్రవైడూర్యాలు రాసులుగా పోసేవారని అందకు రాయలసీమను రత్నాల సీమగా అప్పటి నుంచి ఇప్పటికీ పిలుస్తుంటారు. కానీ అదంతా ఒకప్పుడు అనుకుంటే పొరపాటే.. తాజాగా అనంతపురంలోని శిలలపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలకు అక్కడ అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. ఇవి చాలా అరుదుగా లభించేవని.. అలా దాదాపు 15 రకాల ఖనిజ లవణాలకు సంబంధించిన ఆనవాళ్లను సైన్‌టిస్టులు గుర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
టీవీ, సెల్‌ఫోన్, ఇతర వస్తువుల్లో వాడేది వాటినే..
హైదరాబాదులోని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అనంతపురం జిల్లాలో అత్యంత అరుదైన ఖనిజ సంపదను గుర్తించారు. ఈ ఖనిజ లవణాలు ఏంటంటే.. ప్రజలు నిత్యం ఉపయోగించే సెల్‌ఫోన్, టీవీలు, కంప్యూటర్లు, ఆటోమొబైల్స్ లో వినియోగించే పదార్థాలను ఈ ఖనిజాలతోనే చేస్తారని పరిశోధకులు చెబుతున్నారు. అనేక వస్తువులలో వీటిని ఉపయోగిస్తారని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు అనేక పరిశ్రమలలో కూడా వీటి వినియోగం ఉంటుందని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలోని పలుచోట్ల సైనైటిస్ వంటి సంప్రదాయేతర శిలలపై పరిశోధనలు నిర్వహించిన క్రమంలో 15 విశిష్టమైన ఖనిజ లవణాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పరిశోధనలో లాంథనైట్ సిరీస్ లోని పలు మూలకాలు, ఖనిజ లవణాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు. ఇందులో ముఖ్యంగా శాస్త్రవేత్తలు గుర్తించిన వాటిలో సెరియేట్, థోరైట్, అల్లనైట్, టాంటలైట్, కొలంబైట్, అపటైట్, మోనోజైట్, పైరోక్లోర్ యూక్జెనైట్, ఫ్లోరైట్, జీర్కోన్ వంటి ఖనిజ లవణాలు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు రేడియో యాక్టివ్ మూలకాలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు సైనైట్స్ వంటి సంప్రదాయేతర శిలల కోసం ఇటీవల అనంతరపురంలో సర్వే నిర్వహిస్తుండగా లాంథనైడ్ ఖనిజాలు ఉన్నట్లు వారు కనుక్కున్నారు. అనంతపురంలోని రెడ్డిపల్లె, పెద్దవడగూరు గ్రామాల్లో వివిధ ఆకారాల్లో జిర్కాన్ కనిపించిందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త పీవీ సుందర రాజు తెలిపారు. మోనాజైట్ గింజల్లో రేడియల్ పగుళ్లతో కూడిన బహుళ రంగులు కనిపించాయనీ, ఇది రేడియోధార్మిక మూలకాల ఉనికిని సూచిస్తుందని ఆయన అన్నారు. ఈ ఆర్ఈఈల గురించి మరింత తెలుసుకోవడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ ఖనిజాలను క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, శాశ్వత అయస్కాంతాల తయారీలో కూడా ఉపయోగిరన్నారు. అలాగే, ఆధునిక ఎలక్ట్రానిక్స్ లో కీలకమైన భాగంమైన విండ్ టర్బైన్లు, జెట్ ఎయిర్ క్రాఫ్ట్ సహా అనేక ఇతర ఉత్పత్తులులలో వాడతారన్నారు.
ఇది ఒక ప్రాంత భౌగోళిక చరిత్ర, దాని ఖనిజ నిక్షేపాల మధ్య జన్యు సంబంధాన్ని వివరిస్తోందన్నారు. అనంతపురం జిల్లాలోని పాలియోప్రొటెరోజోయిక్ కడప పరీవాహక ప్రాంతానికి పశ్చిమ, నైరుతి దిశలో ఈ క్షార సముదాయాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో నివేదించిన అనేక ఆల్కలీన్ సైనైట్ నిక్షేపాలను ఆర్ఈఈ కలిగిన ఖనిజాల కోసం కొత్తగా పరిశీలించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ మోనజైట్ గింజల రూపంలో, పలు రంగులలో కనిపించిందంటున్న శాస్త్రవేత్తలు.. ఆర్ఈఈ ఖనిజీకరణ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 300 నమూనాలను సేకరించామని, మరింత జియో కెమికల్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని దంచెర్ల, పెద్దవడుగూరు, దండువారిపల్లె, రెడ్డిపల్లె చింతల్ చెరువు, పులికొండ కాంప్లెక్స్ ఈ ఖనిజాలకు కేంద్రాలుగా ఉన్నాయని.. ఇక్కడ మరిన్ని పరిశోధనలు జరిపి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు.