Hasanamba: ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారు
Hyderabad: హసనాంబ.. ఈ అమ్మవారు ఏడాదికి ఒకసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తారట (spiritual). అందులోనూ దీపావళి పర్వదినాన మాత్రమే ఆలయాన్ని తెరుస్తారట. ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. (hasanamba)
ఈ ఆలయం కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది. 12వ శతాబ్దంలో ఈ హసనాంబ అమ్మవారి ఆలయం నిర్మించారు. జైన మతాన్ని బాగా నమ్మే హోయ్‌సల సామ్రాజ్యంలోని రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారట. దీపావళి పండుగ సమయంలో మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. దాంతో భక్తులు అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో పోటెత్తుతారు. మళ్లీ దీపావళి వరకు అమ్మవారి దగ్గర అంటించిన నంద దీపం వెలుగుతూనే ఉంటుంది. (hasanamba)
దీపంతో పాటు అన్న నైవేద్యం, పూలు, నీళ్లు కూడా అమ్మవారి ముందు ఉంచుతారట. నంద దీపంలో నెయ్యి అయిపోకుండా సంవత్సరం పాటు వెలిగేలా చూస్తారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అమ్మవారికి పెట్టే అన్న నైవేద్యం మళ్లీ ఏడాది తర్వాత తలుపులు తెరిచాక కూడా పాడవ్వకుండా అలాగే ఉంటుందట. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అమ్మవారు ఒకనాడు హసన్ జిల్లాకు వచ్చినప్పుడు అక్కడి అందాలు చూసి పరవశించిపోయారట. దాంతో అక్కడే కొలువై ఉండాలని నిర్ణయించుకున్నారని భక్తులు చెప్తుంటారు.
మహేశ్వరి, కౌమారి, వైష్ణవి అమ్మవార్లు ఆలయంలోని మూడు చీమల పుట్టల్లో కొలువై ఉండాలని అనుకున్నారట. బ్రహ్మి అమ్మవారు హొసకోటేలోని కెంచమ్మ అమ్మవారిగా కొలువై ఉన్నారు. ఇంద్రాణి, వారాహి, చాముండి అమ్మవార్లు దేవెగిరి హోండలోని బావుల్లో కొలువుదీరాలని నిర్ణయించుకున్నారట. హసన్ జిల్లాకు హసనాంబ అమ్మవారి పేరు నుంచే పెట్టారు. అక్కడి అమ్మవారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందని ఆ పేరు వచ్చిందట. (hasanamba)
ఓసారి హసనాంబ అమ్మవారి నగలను నలుగురు దొంగలు అపహరించాలని ప్రయత్నించారని వారిని రాళ్లుగా మార్చేసిందట అమ్మవారు. ఆ రాళ్లు ఇప్పటికీ కల్లప్ప గుడిలో దర్శనమిస్తాయి. మరో ఘటనలో ఓ భక్తురాలిని ఆమె అత్తగారు చిత్రహింసలు పెడుతుంటే ఆమెను కూడా రాయిలా మార్చేసిందట. ఆ రాయి ఏటా అంగుళం పాటు పెరుగుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఆ రాయి పెరుగుతూ అమ్మవారి పాదాలను తాకిన తర్వాత కలియుగం అంతరించిపోతుందట. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే.. సాధారణంగా రావణాసురుడికి పది తలలు ఉంటాయి. కానీ ఈ ఆలయంలోని రావణాసురుడికి 9 తలలు మాత్రమే ఉంటాయి. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదట. ఆలయంలోకి అడుగుపెట్టగానే సిద్ధేశ్వరస్వామి దర్శనమిస్తారు. కానీ విగ్రహం మాత్రం లింగం రూపంలో ఉండదట.