Hanuman: పంచ‌ముఖ ఆంజ‌నేయ‌స్వామి విగ్రహం ఇంట్లో ఉండ‌చ్చా?

Hanuman: చాలా మంది పూజ గ‌దిలో ఆంజనేయ స్వామికి సంబంధించిన చిన్న వెండి విగ్ర‌హాల‌ను పెట్టుకుంటారు కానీ పెద్ద పెద్ద విగ్రహాల‌ను, ఫోటోల‌ను చాలా త‌క్కువ మంది పెట్టుకుంటారు. ఎందుకంటే ఆంజ‌నేయ స్వామి విగ్ర‌హాలు ఇంట్లో ఆడ‌వారికి త‌గ‌ల‌కుండా ఉంటే మంచిదని భావిస్తుంటారు. అయితే పంచ‌ముఖ ఆంజ‌నేయ స్వామి విగ్ర‌హం గురించి ఈరోజు తెలుసుకుందాం. అస‌లు ఈ విగ్ర‌హం ఇంట్లో పెట్టుకోవ‌చ్చా? పెట్టుకుంటే లాభ‌మా? న‌ష్ట‌మా? (Hanuman)

పురాతన కాలం నుంచి మనమంతా తూ.చా తప్పకుండా పాటిస్తున్న భారతీయ సంస్కృతుల్లో ఒకటి వాస్తు శాస్త్రం. ఈ శాస్త్ర ప్రకారం వస్తువులు ఉంచిన ప్రదేశాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో బలం చేకూరుతుంది. అదే విధంగా పంచముఖి (ఐదు ముఖాల ఆంజనేయుడు) ఆంజనేయ స్వామి బొమ్మ లేదా విగ్రహం ఉంచడం వల్ల ఆ వాతావరణం ఆహ్లాదకరంగానూ మరియు సామరస్యంగానూ ఉంటుంది.

పంచముఖ ఆంజనేయ స్వామిని ఒకసారి పరిశీలిస్తే..

ఐదు ముఖాలు అని “పంచముఖి” అనే పేరు వింటేనే తెలిసిపోతుంది. ప్రతి ముఖం ఒక్కో దిశను సూచిస్తుంటాయి. తూర్పు వైపుకు అభిముఖంగా ఉండే ఆంజనేయుడు తెలివితేటలతో పాటు జ్ఞానాన్ని సూచిస్తుంటారు. దక్షిణ వైపుగా ఉండే నరసింహావతారం ధైర్యం మరియు రక్షణకు, గరుడావతారంలో పశ్చిమం వైపుగా కనిపించే ముఖం ఆధ్యాత్మికతతో పాటు ముక్తిని, వరాహవతారంలో కనిపిస్తూ ఉత్తరం వైపుగా ఉండే ముఖం సంపదను, హయగ్రీవ అవతారంలో కనిపించే పైకి చూస్తున్నట్లుగా కనిపించే హనుమాన్ జ్ఞాపక శక్తిని మరియు శక్తిని ప్రతిబింబిస్తుంది.

పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంతో ప్రయోజనాలు:

* పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంట్లో ఉంచుకుంటే వాస్తుదోషాలు తొలగిపోవును. దుష్ట శక్తులు పటాపంచలై సంతోషం, విజయం, సంక్షేమం వెల్లివిరిసి సంపదకు నిలయమవుతుంది.

* దుష్ట శక్తులు, భూత, ప్రేతాత్మలు వంటి పీడలు పోయేందుకు పంచముఖి ఆంజనేయస్వామి పటాన్ని పెట్టుకుంటుంటారు. (Hanuman)

* ప్రతి ముఖం యొక్క పరమార్థం తెలుసుకుని కొలవడం వల్ల ఆ పంచముఖ హనుమంతుడి దయ పొందగలం. ఆయన చల్లని కరుణతో ప్రశాంతత, అదృష్టం వెన్నంటే ఉంటాయి.

* పంచముఖి ఆంజనేయస్వామి సన్నిధిలో ఉంటే ఆధ్యాత్మికత మార్గదర్శకత్వంతో పాటు ఆ సర్వశక్తిమంతుడు మనతో నేరుగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది.