అల్లకల్లోలంగా ఉన్న జీవితాన్ని మార్చే స్తోత్రం
Sankashtahara chaturthi: ఏం చేసినా కలిసి రావడంలేదు.. సంతాన లేమి.. అల్లకల్లోలంగా మారిపోయిన జీవితాలు.. ఇలా ఎన్ని సమస్యలున్నా పరిష్కారం ఒక్కటే. అదే సంకష్ఠహర చతుర్ధి పూజ. ఈ పూజ చేస్తే కలిగే ఫలితాలు జీవితంలో వచ్చే మార్పులు ఆచరించిన వారికే తెలుస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి నెలా వచ్చే కృష్ణ పక్ష చతుర్థి రోజున ఈ పూజ చేస్తుంటారు. సంకష్టం అంటే అతిపెద్ద కష్టం అని అర్థం. అలాంటి ఏ కష్టం ఉన్నా ఈ చతుర్ధి రోజున వ్రతం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుందని పెద్దలు చెప్తున్న మాట.
అసలేంటీ సంకష్టహర చతుర్థి?
విఘ్నేశ్వరుడికి 32 స్వరూపాలు ఉన్నాయి. అందులో 32వ స్వరూపమే ఈ సంకష్టహర గణపతి. ఆయన తన దేవేరిని ఎడమ తొడ వైపు కూర్చోపెట్టుకుని ఉంటారు. ఆ స్వామికి ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ప్రీతి. అందుకే ఈ వ్రతం ఏ నెలలో అయినా కృష్ణ పక్షం చతుర్థిలో మొదలుపెట్టచ్చు. అందులోనూ మంగళవారం ఈ చతుర్థి వచ్చిందంటే ఇక ఆ రోజు ఈ పూజ మొదలుపెడితే వెనక్కి తిరిగి చూస్కోవాల్సిన అవసరం ఉండదు. అన్ని ఫలితాలు ఉంటాయి.
ఈ పూజ ఫలితమేంటి?
మనకి పురాణాల్లో ఈ పూజ చేస్తే వచ్చే 13 ప్రయోజనాలు చెప్పారు. ఆ రకమైన కష్టాలు ఉన్నావారు ఈ వ్రతాన్ని చేస్తే ఎంతో మంచిది. ఇంతకీ ఏంటీ 13 ప్రయోజనాలు?
పనులు మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు.
జీవితంలో అభివృద్ధి లేనప్పుడు
నరదృష్టి
ఆర్థిక కష్టాలు
సంతానలేమి
గృహ వసతి లేకపోయినా..
అనారోగ్యం
విద్యాభ్యాసం సరిగ్గా లేకపోయినా
శత్రుపీడ ఉన్నా..
పంటలు సరిగ్గా పండకున్నా..
వివాహం కాకపోయినా
దంపతుల మధ్య సయోధ్య లేకపోయినా
చేయని తప్పుకి శిక్ష పడినా..
వ్రత నియమాలు
ఈ వ్రతాన్ని బహుళ పక్ష చతుర్థి రోజున చేయాలి.
ఆ రోజున చంద్రోదయం సమయానికి చతుర్ధి తిథి రావాలి.
ఆరోజున తెల్లవారుజామున లేచి నీళ్లల్లో కాసిన్ని నల్ల నువ్వులు వేసుకుని స్నానం ఆచరించండి.
ఆ తర్వాత స్వామి వారికి ముడుపు కట్టాలి. అంటే వ్రతం సాయంత్రం చేయాలి.. ముడుపు పొద్దున కట్టాలి.
ఎరుపు రంగు వస్త్రంలో పసుపు, కుంకుమ వేసి మూడు దోసిళ్లతో బియ్యం వేయండి. ఆ తర్వాత రెండు ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షిణ, తాంబూళం వేసి ముడుపు కట్టండి. ఆ మూటను గణపతి వద్ద ఉంచండి.
ఆ తర్వాత స్వామి పేరు జపిస్తూ 21 ప్రదక్షిణలు చేస్తూ మీ కోరికను స్వామి వారికి చెప్పండి.
ఉదయం అంతా ఆహారం తీసుకోకూడదు. పాలు, పండ్లు వరకు అయితే ఫర్వాలేదు. అనారోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా తినండి. ఏమీ కాదు. ఈ ఉపవాస నియమం కేవలం ఓపికతో చేయగలిగేవారికి మాత్రమే.
ఆ రోజంతా మౌనంగా ఉండండి. అక్కర్లేని మాటలు వద్దు.
సూర్యాస్తమయం అయ్యాక తల స్నానం తోరాలు కట్టి దీపం పెట్టి ఈ పూజ మొదలుపెట్టాలి. ఆ తర్వాత ముడుపు కట్టిన బియ్యంతో రెండు పదార్థాలు చేయాలి. ఉండ్రాళ్లు, పాయసం చేస్తే మరీ మంచిది.
ఇంటికి ఎవరైనా వస్తే అతిథిగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టండి. ఎవరూ రాకపోతే తరువాతి రోజు ఉదయం వినాయకుడి ఆలయానికి వెళ్లి ఎవరికైనా ఏదైనా దానం చేయండి.
వ్రతం ముగిసిన మరుసటి రోజు గణపతి హోమం చేయించుకుంటే మంచిది. అయితే ఈ హోమం చేయించకపోయినా ఏమీ కాదు.
వ్రతం ఎలా చేయాలి?
ఆచమనం, సంకల్పం, కలశారాధన
విఘ్న నివారణ గణపతి పూజ
సంకష్ట హర గణపతి షోడశోపచార పూజ
అంగ పూజ
ఏకవింశతి పుష్ప పూజ (21 పుష్పాలతో పూజ చేయాలి. 21 రకాల పూలు దొరక్కపోతే.. ఒకే రకమైన పువ్వులను 21 తీసుకోండి)
ఏకవింశతి పత్ర పూజ (21 రకాల పత్రం (ఆకులు)తో పూజ చేయాలి)
శ్రీ వినాయక అష్టోత్తర నియమావళి
సంకటనాశన గణేశ స్తోత్రం
గౌరీ పూజ
పంచోపచార పూజ
దూర్వాయుగ్మ పూజ
వ్రత కథలు