Spiritual: దీపంలో ఎన్ని వత్తులు వేయాలి?
Spiritual: దీపం పెట్టేటప్పుడు కొందరు రెండు వత్తులు వేస్తుంటారు. మరికొందరు మూడు వరకు వేస్తుంటారు. కానీ ఎక్కువ మంది రెండు వత్తులే పెడుతుంటారు. అసలు శాస్త్రం ప్రకారం దీపం పెట్టేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలి? వత్తుల విషయంలో మనం ఏ రకమైన పూజ చేస్తున్నామనే దానిని బట్టి సంప్రదాయం ఉంటుంది. ఉదాహరణకు.. మీకు సప్త శనివారం వ్రతం చేస్తున్నట్లైతే 7 వత్తులు వేసి దీపం పెట్టాలి. రుషి పంచమి పూజ చేస్తే నాలుగు కానీ ఏడు కానీ వేస్తారు. ఇక నిత్య పూజ చేసే సమయంలో ఓ శాస్త్రం ఉంది. సాజ్యం త్రివర్తి సంయుక్తం అని ఓ శ్లోకం ఉంది. అంటే.. దీపాన్ని మూడు వత్తులతో వెలిగించాలి అని.
ఇక చేయకూడనిది ఏంటంటే.. ఎప్పుడూ కూడా ఒక దీపాన్ని పెట్టకండి. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఒక దీపం పెడతారు. మరి తులసి కోట దగ్గర ఒక్కటే పెడతాం కదా అనే సందేహం మీకు రావచ్చు. మనం తులసి కోట దగ్గర పెట్టే దీపంలో కూడా మూడు వత్తులు వేసుకోవాలి. ఇప్పుడు తులసి కోట దగ్గర మాత్రమే పెట్టే అందమైన దీపాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దీపం పెట్టినా చూడటానికి ఎంతో చక్కగా ఉంటుంది.