గుండెల్లో మంట..నిర్ల‌క్ష్యం చేయ‌కండి

ప్రస్తుతం గుండె సంబంధ సమస్యలతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గుండెల్లో ఏమాత్రం తేడా అనిపించినా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గుండెల్లో మంట, ప‌ట్టేసిన‌ట్లు ఉండటం చాలా సాధారణంగా కనిపించే సమస్య. చాలామంది తరచుగా గుండెల్లో మంట అని ఇబ్బంది పడుతుంటారు. ఇది గుండెకు సంబంధించిన సమస్య అని భయపడతారు. కానీ ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించినది. దీనిని వైద్య పరిభాషలో పైరోసిస్​ అని పిలుస్తారు. ఇది GERD (గ్యాస్ట్రో- ఈసోఫేగల్ రిఫ్లక్స్ వ్యాధి) యొక్క అత్యంత సాధారణ లక్షణం. ఛాతీ ప్రాంతంలో మంటగా ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. సాధారణంగా దీన్ని ఎసిడిటీ లేదా హైపర్ ఎసిడిటీ అని పిలుస్తారు. ఈ సమస్యతో బాధపడేవారికి తరచుగా, గుండెల్లో మంట గొంతులో వేడి, పుల్లని తేన్పులు వ‌స్తుంటాయి.

ఆహారాన్ని మింగడం కూడా కష్టంగా ఉంటుంది. జీర్ణాశయంలోని జీర్ణరసాలు అన్నవాహిక వరకు తిరిగి ప్రవహించినప్పుడు గుండెల్లో మంట వస్తుంది. అన్నవాహిక దిగువన ఎసోఫాగియల్ స్పింక్టర్ అని పిలిచే ఒక కవాటం ఉంది. ఇది ఆహారాన్ని లోపలకు పంపేందుకు తెరచుకుంటుంది. తర్వాత జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు మూసుకుంటుంది. కానీ, ఈ కవాటం సరాగ్గా మూసుకుపోనప్పుడు కడుపు నుండి కొంత ఆమ్ల మిశ్రమం అన్నవాహిక పైకి వెళ్ళి, రిఫ్లక్స్‌కి దారి తీస్తుంది. దీంతో గుండెల్లో మంట వస్తుంది. కొన్నిసార్లు గర్భాధారణ సమయంలో వాడే మందుల వల్ల కూడా గుండెల్లో మంట కలిగే అవకాశం ఉంటుంది. అయితే గుండెల్లో మంట కలిగినప్పుడు చాలామంది ఈనో, సోడా వంటి గ్యాస్​ ఉండే పానీయాలను తీసుకుని ఉపశమనం పొందుతారు. కానీ అది అప్పటికప్పుడు ఉపశమనం కలిగించినా దీర్ఘకాలికంగా అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.

కొన్ని చిట్కాల ద్వారా గుండెల్లో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ మరీ గుండెల్లో పట్టేసినట్లు అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిది. వయసుతో సంబంధం లేకుండా ఎదురయ్యే ఈ సమస్యని కొన్ని చిట్కాలతో వైద్యుల అవసరం లేకుండా మనమే తగ్గించుకోవచ్చు అంటున్నారు నిఫుణులు. ఆ చిట్కాలేంటో చూద్దాం..

*తినేట‌ప్పుడు నిటారుగా కూర్చుని తిన‌డానికి ప్ర‌య‌త్నించండి. ముందుకి వంగి తిన‌కూడ‌దు

*టీవీ చూస్తూ తిన‌కూడ‌దు. ఏకాగ్ర‌త మొత్తం తినే ప్ర‌క్రియ‌పైనే ఉండాలి. మీ ఆలోచ‌న తింటున్న ముద్ద‌పైనే ఉండాలి.

*ప‌డుకోవ‌డానికి మూడు గంట‌ల ముందు భోజ‌నం చేసేలా చూసుకోండి. తిన్న‌వెంట‌నే నిద్ర‌పోకూడ‌దు. అందులోనూ నిలువుగా అస్స‌లు ప‌డుకోకూడ‌దు. తిన్న వెంట‌నే ఓ ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఎంతో మంచిది. దీనినే పోస్ట్ మీల్ వాక్ అంటారు.

* కాలం ఏదైనా తగినన్ని నీళ్లు తాగాలి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జీర్ణ క్రియ సజావుగా జరగడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది.

* సహజంగా చాలామందికి ఎక్కువసార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే సాధారణ టీకి బదులు గ్రీన్ టీ లేదా హెర్బల్​ టీ తాగమని సూచిస్తున్నారు వైద్యులు. గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చెబుతున్నారు.

* సాధారణంగా పాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. పిల్లల్లోనూ పాలు తాగడం అంటే ఒక రకమైన అఇష్టం ఉంటుంది. పాల గ్లాసు చూస్తేనే పరిగెడతారు. అయితే రోజుకు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా వంటబడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలల్లో ఉండే పోషకాల వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగిపోతుందట.

* స్మోక్ చేయడం వల్ల ఊపిరితిత్తులు పాడవడమే కాదు తిన్న తిండి కూడా జీర్ణం కాదు. దీనివల్ల ఎసిడిటీ సమస్య మరింత పెరిగిపోతుందట. స్మోకింగ్ అలవాటును ఎంత త్వరగా మానుకుంటే అంత తొందరగా ఎసిడిటీకి దూరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

* రోజూవారి ఆహారంలో కారం పరిమాణం తక్కువగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొంతమందికి రోజూ పచ్చడి తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారికి భవిష్యత్తులో ఎసిడిటీ బాధ తప్పదు అంటున్నారు నిపుణులు.

* కొంతమంది పని ఒత్తిడిలో పడి సకాలంలో తినరు. దీనివల్ల భవిష్యత్‌లో కచ్చితంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు మాత్రం తరుచూ తింటూనే ఉంటారు. ఇది కూడా సమస్యలకు దారి తీస్తుందంటున్నారు. మితంగా తినాలి కానీ సకాలంలో తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

* పుదీనా ఆకులు వేసి మరిగించిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి జీర్ణాశయంలోకి చేరి చల్లబరుస్తాయి.

*గుండెల్లో మంటగా అనిపిస్తే లవంగం నోట్లో వేసుకుని చప్పరిస్తే సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. ఇది జీర్ణ సంబంధ వ్యాధుల బారి నుంచి కూడా కాపాడుతుంది.

* మునగకాయలు, బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, క్యారెట్, నీరుల్లి లాంటివి తింటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. ఏ ఆహారం తీసుకున్నా నిద్రకు ఉపక్రమించే కనీసం రెండు మూడు గంటల ముందు తినడం మంచిది.

* నికోటిన్​, కెఫిన్​ ఉండే పదార్థాలు తీసుకోవడం తగ్గించి పైనాపిల్​, బొప్పాయి వంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగి పాత్రల్లో రాత్రంతా ఉంచిన నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

* ఓట్స్, బ్రౌన్‌రైస్, తృణధాన్యాలు, చిలగడదుంపలు, క్యారెట్లు, బీట్‌రూట్స్ వంటి రూట్ కూరగాయలు, బ్రోకలీ, కాలే, బచ్చలికూర, బీన్స్ వంటి ఆకుపచ్చ కూరగాయలను తీసుకుంటూ ఉల్లిపాయలు, సిట్రస్ ఫ్రూట్స్, కొవ్వు పదార్థాలు, టమాటాలు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి.