మీ గుండె.. ఇలా ప‌దిలం

ఈమధ్య కాలంలో గుండెపోటుతో సంభవించే మరణాల రేటు క్రమంగా పెరుగుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ గుండెపోటు బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. వీరిలో ముఖ్యంగా 20‌‌ నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వారే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. అందులోనూ నిత్యం వ్యాయామం చేసేవాళ్లు, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం అంతుచిక్కని పరిస్థితులను కలిగిస్తోంది. అయితే, గుండె ఆరోగ్యంగా ఉండి దాని పనితీరు మెరుగుపడాలంటే పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు నిపుణులు. హృదయాన్ని పదిలంగా కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందాం..

తగిన బరువు

అధిక బరువు, ఊబకాయం గుండె సంబంధితన సమస్యలకు దారితీసి గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్నితీసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఎత్తు, వయస్సుకి తగిన బరువును కలిగి ఉండాలి. అధిక బరువు గలవారిలో గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

సంపూర్ణ ఆహారం

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్,యు ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. ప్రాసెస్​ చేసిన ఆహారం, అధిక కొవ్వు, మసాలాలు, జంక్​ఫుడ్​, డెయిరీ ఉత్పత్తులు వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది.

వ్యాయామం

శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపరిచే ఏకైక సాధనం వ్యాయామం. ముఖ్యంగా గుండె పనితీరు మెరుగుపరిచి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.  వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికి తోచిన విధంగా వారు జాగింగ్​, వాకింగ్, సైక్లింగ్​ వంటి వివిధ పద్ధతులను ఎంచుకోవచ్చు.

ఒత్తిడి

ప్రస్తుతం గుండెపోటు మరణాల సంఖ్య పెరగడానికి ముఖ్య కారంణం ఒత్తిడి. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.  ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి యోగా, ధ్యానం, తగిన నిద్ర వంటి మార్గాలను ఎంచుకోవచ్చు. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే మంచి సైక్రియాటిస్ట్​ని కలిసి తగిన సలహాలు తీసుకుని ఒత్తిడిని జయించవచ్చు.

ధూమపానం

పొగ తాగడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలవాటు ఉన్నవాళ్లు క్రమక్రమంగా తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. ధూమపానం వల్ల ఇతర కుటుంబ సభ్యులు కూడా సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు ధూమపానం క్యాన్సర్​కు దారితీసే అవకాశాలు ఎక్కువ.

రెగ్యులర్​ చెకప్స్

ఏ వయస్సు వారైనా రెగ్యులర్​గా చెకప్స్​ చేయించుకోవడం మంచిది. దీని వల్ల శరీరంలో ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోవడం సులువవుతుంది. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడినవారు తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి గుండె పనితీరు, మూత్రపిండాల పనితీరు ఎలా ఉందనేది కచ్చితంగా పరీక్షలు చేయించాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వేళకు మందులు వేసుకుని రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.