Lazy: సోమరితనాన్ని ఇలా తరిమికొట్టండి
Hyderabad: సోమరితనం (lazy).. మనిషిని మానసికంగా ఎదగనివ్వకుండా చేస్తుంది. మనలో ఎన్నో నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఈ సోమరితనంతో ఏమీ సాధించలేకపోతాం. ఈ లేజీనెస్‌ని (laziness) సులువుగా తరిమికొట్టే మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.
పడుకునేముందు ఒక నాలుగైదు ఎండుద్రాక్ష పలుకులు గ్లాస్ నీళ్లలో నానబెట్టండి. ఉదయం మీ పనులు పూర్తిచేసుకున్నాక ఆ ఎండుద్రాక్ష నీళ్లను తాగుతూ నెమ్మదిగా వాటిని నమలండి. ఇవి తిన్నాక ఒంట్లో ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఆ తర్వాత ఏదో ఒక వర్కవుట్ చేయండి. జిమ్‌కి వెళ్లలేనివారు ప్రాణాయామ, యోగా, వాకింగ్, జాగింగ్ ఇలా ఏదో ఒక దానిని మీ అలవాటుగా మార్చుకోండి. ఆ తర్వాత ఆ రోజుకి చేయాల్సిన పనులను ఓ లిస్ట్‌లో రాసిపెట్టుకోండి.
అవి మీ ఆఫీస్ పనులే కానక్కర్లేదు. ఇంట్లో చేయాల్సినవి కూడా రాసిపెట్టుకోవచ్చు. ఆ లిస్ట్‌లో రాసిపెట్టుకున్నవి పూర్తిచేసాక మళ్లీ ఆ లిస్ట్ వైపు చూస్తే అన్ని పనులు చేసేసాం అన్న సంతృప్తి కలుగుతుంది. రోజులో ఏదో ఒక పండు తినడానికి పెట్టుకోండి. జ్యూస్‌లా కాకుండా నేరుగా కొరికి బాగా నమిలి తినండి. ఎందుకంటే ఒక్కోసారి ఒంట్లో ఎనర్జీ లేకపోయినా సోమరితనం దాపరిస్తుంది.
రాత్రి 7 గంటలకల్లా డిన్నర్ ముగించేసేలా చూసుకోండి. అదికూడా హెవీగా తినేయకండి. ఆలస్యంగా డిన్నర్ చేస్తే రాత్రి పడుకున్నాక శరీరంలో టాక్సిన్లు పెరిగిపోతాయ్. ఇక హెవీగా తిన్నారంటే ఉదయం లేచాక నిస్సత్తువగా అనిపిస్తుంది. ఇంకా పడుకోవాలని ఉంటుంది. ఇక ఈ సోమరితనాన్ని పోగొట్టడంలో మనం మన బాడీకి ఎంత రెస్ట్ ఇస్తున్నామన్నది చూసుకోవాలి. మనిషికి దాదాపు 8 గంటల నిద్ర ఉండాలి అంటుంటారు. అది ఏవైనా 8 గంటలు అనుకుంటే పొరపాటే. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయాన్నే 5 గంటలకే లేచే వారిలో ఎనర్జీ బాగా ఉంటుంది. ఈ చిన్న అలవాట్ల వల్ల మీ జీవితంలో జరిగే మార్పులు మీరే గమనిస్తారు.