ఫ్లూ లక్షణాలున్నాయా? ఇలా చేసి చూడండి

దేశవ్యాప్తంగా H3N2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలుగు రాష్ట్రాలకూ హైఅలర్ట్‌ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వైరస్​ కారణంగా.. దగ్గు, జ్వరం, వికారం, వాంతులు, గొంతు నొప్పి, అతిసారం, శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. 15 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన ఈ వైరస్​ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే, H3N2 ఇన్‌ఫ్లుయెంజా చికిత్సకు యాంటీబయాటిక్స్‌ విచక్షణారహితంగా వాడొద్దని సూచిస్తోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంటి చిట్కాలతో ఈ వైరస్​ ఇన్​ఫెక్షన్​ వల్ల వచ్చే జ్వరం, దగ్గు వంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం..

పసుపు

పసుపులో యాంటీబయాటిక్​ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. H3N2 ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలతో పోరాడటానికి ఆహారంలో పసుపును చేర్చుకోవాలి. పసుపులో ఉండే కర్కుమిన్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు ఉంటాయి. దీనిలో విటమిన్లు, మినరల్స్‌, మాంగనీస్‌, ఐరన్‌, ఫైబర్‌, విటమిన్‌ బి6, కాపర్‌, పొటాషియం వంటి పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. ఇది దగ్గు, జలుబు, జ్వరం తగ్గించడానికి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. పసుపు కలిపిన పాలు, టీ తాగడం వల్ల కూడా దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలను తగ్గించుకోవచ్చు. గ్లాసు నీళ్లలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం, ఒక స్పూన్​ తేనె వేసి మరిగించి తాగితే సత్వర ఉపశమనం కలుగుతుంది. ఇది కఫాన్ని తగ్గించేందకు కూడా ఉపయోగపడుతుంది.

నీళ్లు

ఎండాకాలం ఎన్ని నీళ్లు తాగినా బాడీ డీ హైడ్రేటెడ్‌ అవుతూ ఉంటుంది. అయితే తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే శక్తి వస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు తప్పని సరిగా సరిపడా నీళ్లు తాగాలి. దాహం వేసినా, లేకపోయినా రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్యూస్‌లు, నీళ్లు, కెఫిన్‌ లేని టీ, సూప్‌ వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. సోడా, ఆల్కహాల్‌, కాఫీ వంటి పానీయలకు దూరంగా ఉండాలి. తరచుగా వేడి నీళ్లలో ఉప్పు వేసి పుక్కిలిస్తూ ఉండాలి.

విటమిన్‌ సి

విటమిన్‌ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను రోజూవారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కివి వంటి వాటిలో విటమిన్​ సి ఎక్కువగా లభిస్తుంది.

అల్లం

జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేయడానికి అల్లం శక్తివంతంమైన ఔషధంలా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతి రోజు అల్లం టీ తాగితే.. ఫ్లూ లక్షణాలు త్వరగా నయం అవుతాయి.

ఈ టిప్స్​ ఫాలో అవుతూనే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గినా, తుమ్మినా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్​ ధరించడం మంచిది. ఫ్లూతో బాధపడుతున్నప్పుడు తేలికపాటి దుస్తులు ధరించడంతోపాటు శుభ్రమైన దుప్పట్లు ఉపయోగించాలి.