Rakhi పండుగ రోజు చేయాల్సినవి.. చేయకూడనివి..!
రాఖీ పండుగ (rakhi) అంటే ఏముంది.. అన్నకో తమ్ముడికో ఓ రాఖీ కట్టేసి వారికి ఒక స్వీట్ తినిపించి వారి నుంచి డబ్బులో కానుకలో తీసేసుకుంటే అయిపోతుంది అనుకుంటారు చాలా మంది. కానీ రాఖీ పండుగ నాడు కూడా పాటించాల్సిన కొన్ని నియమాలు అలాగే చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం
రాఖీ (rakhi) అంటే ఏదో సింపుల్ పండుగ అనుకోకండి. ఆ రోజున మీ అన్నలు కానీ తమ్ముళ్లు కానీ నిద్రలేవకుండానే రాఖీ కట్టేసి వెళ్లిపో అంటుంటే మాత్రం అస్సలు కుదరదు అని చెప్పేయండి. ఎందుకంటే ఇది కేవలం చేతికి ఏదో చిన్న దారం కట్టి వదిలేసే పండుగ కాదు. మనం దీపావళి, దసరా, వినాయక చవితిని ఎంత నిష్ఠగా చేసుకుంటామో.. ఈ రాఖీ పండుగను కూడా అలాగే జరుపుకోవాలి. కాబట్టి.. రాఖీ కట్టేముందు అన్నలు, తమ్ముళ్లు రాఖీ కట్టే ఆడపిల్లలు కూడా ఉదయాన్నే లేచి తల స్నానం చేయాలి. శుభ్రత అనేది చాలా ముఖ్యం.
ఇక రాఖీ కట్టేముందు అన్నలను తమ్ముళ్లను పీట వేసి కూర్చోపెడితే మంచిది. ఇప్పుడంటే కుర్చీలు, సోఫాల్లో కూర్చుని కట్టించేసుకుని వెళ్లిపోతున్నారు. కానీ పీట అయితే మరీ మంచిది. ఇక కూర్చునే డైరెక్షన్ అంటే కూర్చునే దిశ కూడా చాలా ముఖ్యం. తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చోవాలి. దక్షిణ దిశ వైపు మాత్రం అస్సలు కూర్చోకూడదు. రేపు 30వ తారీఖున ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పొరపాటున దక్షిణ దిశ వైపు కూర్చుని రాఖీ కట్టినా కట్టించుకున్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు ప్రవేశిస్తాయి. (rakhi)
ఇక రాఖీ కట్టేటప్పుడు అన్నలు, తమ్ముళ్లు తమ తలపై ఏదైనా కర్చీఫ్ ధరిస్తే మంచిది. అదే విధంగా రాఖీ కట్టే ఆడపిల్లలు కూడా దుపట్టాను తలపై వేసుకోవాలి. ఇలా చేస్తే మంచిది అంటారు. తమ్ముళ్లకు, అన్నలకు రాఖీ కట్టే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో వినాయకుడి ఫొటో దగ్గర కానీ విగ్రహానికి కానీ బొట్టు పెట్టి.. ముందు ఆయనకు రాఖీ సమర్పించాలి. ఎందుకంటే ఓ అన్న తమ్ముడు తండ్రిలాగే గణనాథుడు కూడా సర్వ విఘ్నాలను తొలగించి మనల్ని కాపాడతాడు. కాబట్టి ముందు రాఖీ ఆయనకే కట్టాలి. ఆ తర్వాత అన్నలకు తమ్ముళ్లకు నుదటన కుంకుమ పెట్టి హారతి ఇచ్చి వారికి రాఖీ కట్టాలి. ఆ తర్వాత మిఠాయి తినిపించాలి.
ఒకవేళ మీరు అన్నయ్యకు కడుతున్నట్లైతే… వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఆశీర్వాదం తీసుకునే ముందు ఆడపిల్ల చేతులు మగపిల్లాడి కాళ్లకు తగిలించకూడదు. ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మీ చేతులను నేలకు తాకించాలి. అదే మీరు తమ్ముడికి రాఖీ కడుతున్నట్లైతే.. వారికి మీరు ఆశీర్వాదం ఇవ్వచ్చు. (rakhi)
ఇక్కడ మరో విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు రాఖీ కట్టే సమయాన్ని చూసుకోండి. అప్పుడు రాహు కాలం కానీ ఉన్నట్లైతే.. అస్సలు కట్టకండి. అది మంచిది కాదు. ఇక ఎలాంటి రాఖీలను ఎంచుకోవాలంటే…ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల డిజైన్లు వస్తున్నాయి. అవన్నీ కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి అమ్ముతుంటారు. కానీ రాఖీపై ఉండే డిజైన్ ఎప్పుడూ ఓం.. స్వస్తిక్..కలశం ఆకారాల్లో ఉండాలి. అలాంటివి కడితేనే అది నిజమైన రాఖీ పండుగ అవుతుంది. ఏదో ఫ్యాషన్ కోసం ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ కొనుక్కుని కట్టేయకండి.
ఇక రాఖీ పండుగ రోజు ఇచ్చిపుచ్చుకునే కానుకల గురించి తెలుసుకుందాం. కానుకలు రాఖీ కట్టేవారు కట్టించుకునేవారు ఇలా ఎవరైనా ఇవ్వచ్చు. మీరు ఎలాంటి కానుకలు ఇచ్చినా పర్వాలేదు కానీ షార్ప్‌గా ఉండే వస్తువులను మాత్రం ఇవ్వకండి. అది మంచి శకునం కాదు. (rakhi)