రోజూ ఎంత దూరం నడవాలో తెలుసా?

ఆధునిక జీవనశైలిలో ఆహారంతో పాటు అన్నింట్లోనూ మార్పు వచ్చింది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. యుక్త వయస్సులోనే రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు చాలామంది. అయితే వీటన్నింటికీ వ్యాయామం మంచి మందులా పని చేస్తుంది. ముఖ్యంగా నడక చాలా మంచిది. క్రమం తప్పకుండా ఉదయాన్నే వాకింగ్​ చెయ్యడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చెక్​ పెట్టవచ్చనేది నిపుణుల మాట. చాలా సందర్భాల్లో ఈ మాటలు నిజమేనని పలు అధ్యయనాలు కూడా తేల్చాయి. అయితే రోజుకు 10 వేల అడుగులకు తగ్గకుండా నడిస్తే.. అనేక ఆరోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు అనేది చాలామంది నమ్మే విషయం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతీ రోజు కనీసం 10 వేల అడుగులు నడవాల్సిందే అనేది కొందరి వాదన. అసలు ఇదంతా నిజమేనా ? కేవలం వాకింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటే నమ్మొచ్చా ? అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అయితే దీనిపై డాక్టర్లు చెప్పే మాటేమిటంటే..
రోజుకు 10,000 అడుగులు నడిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పే వాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ.. వాస్తవానికి మొదటిసారిగా ఈ మాట చెప్పిన వాళ్ల ఉద్దేశం తెలిస్తేనే కొంత సందేహం కలగక మానదు. 1965లో ఒక జపాన్ కంపెనీ వారు తమ స్టెప్ మీటర్ విక్రయాలు పెంచుకోవడం కోసం చేసిన ప్రకటనలోంచి ఈ ప్రచారం పుట్టుకొచ్చింది అని చెబుతుంటారు. అంటే ఇది హెల్త్ మేటర్ కంటే మార్కెటింగ్ కోణమే ఎక్కువగా కనిపిస్తోంది అనే వాదన కూడా ఉంది.

అయితే, ఈ వాదన సంగతి ఎలా ఉన్నప్పటికీ.. శారీరక శ్రమ అనేది ఎవరికైనా మేలు చేసే అంశమే అనేది డాక్టర్ల అభిప్రాయం. సాధారణంగా ఎవరైనా సరే నిత్యం తమ దైనందిన జీవితంలో 5 వేల నుంచి 7,500 అడుగులు నడుస్తారు. ఇంకొంత శ్రమ అనుకోకుండా వాకింగ్ కోసం మరో 30 నిమిషాలు కేటాయిస్తే.. 3 వేల నుంచి 4 వేల అడుగులు అదనంగా నడుస్తారు. అన్నీ కలిపి మొత్తం 10 వేల అడుగులకు చేరువలో ఉంటాం. అసలు నడవకుండా ఒకే చోట ఉండటం కంటే.. ఎంతో కొంత నడవడం అనేది ఆరోగ్యానికి మేలు అంటున్నారు నిఫుణులు. రోజుకు 10 వేల అడుగులు కచ్చితంగా పూర్తి చేయాలని ఏమీ లేదని.. కనీసం 7000 అడుగులు నడిచినా ఫర్వాలేదంటున్నారు. కానీ క్రమం తప్పకుండా నడవడం వల్ల ప్రయోజనం ఎక్కువని సూచిస్తున్నారు.
ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులను దూరం పెట్టొచ్చు. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. మధుమేహం నియంత్రణలో ఉండటం వల్ల డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చు. అధిక రక్త పోటును నివారించవచ్చు. డిప్రెషన్‌ని సైతం జయించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ నడవడం మొదలు పెట్టేయండి మరి!