మర్చిపోతున్నారా.. ఇలా చేసి చూడండి!
ఒక వయస్సు దాటాకా చాలామందిలో కనిపించే సాధారణ సమస్య మతిమరుపు. వయస్సు పెరిగేకొద్దీ అన్నింటిని గుర్తు పెట్టుకోవడం రోజురోజుకీ కష్టంగా మారుతుంది. అయితే ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిలో ఈ సమస్య తలెత్తుతోంది. ప్రతి విషయానికీ చేతిలో మొబైల్ ఫోన్ అందుబాటులో ఉండటంతో ప్రత్యేకంగా గుర్తుంచుకునే అవసరం లేకుండా పోతుంది. అయితే ఇది భవిష్యత్తులో చాలా అనర్ధాలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు. కనీస విషయాలను గుర్తుంచుకోగలగడం ఆరోగ్యకరమైన మనిషి లక్షణాల్లో ఒకటని చెబుతున్నారు. గుర్తుపెట్టుకోవడం అనేది మెదడుకు మనం అందించే వ్యాయామం లాంటిదని, అది కూడా మనం వస్తువులకు చెప్పేస్తే మెదడు పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. మనం శరీర ఆరోగ్యం కోసం వ్యాయాయం చేసినట్లే మెదడుకు కూడా వ్యాయామం అందిస్తే ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వయస్సు పైబడిన వారిలో జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి నిపుణులు చెబుతున్న సూచనలేంటో తెలుసుకుందాం..
పుస్తకాలు చదవడం
పుస్తకాలు చదవడమనేది చాలా మంచి అలవాటు. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్.. అభిరుచిని బట్టి ఏ పుస్తకాలైనా చదువుకోవచ్చు. నాన్ ఫిక్షన్ పుస్తకాలు నాలెడ్జ్‌కి కేంద్రాలు అయినప్పటికీ, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విషయానికి వస్తే నవలలు చదవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నవలల చదువుతుంటే అందులోని పాత్రలు కళ్ల ముందుకు వస్తూ, పోతుంటాయి. మొదటి పేజీలో ఒక పాత్ర పరిచయం అవుతుంది. మళ్లీ పదో పేజీలో ఆ పాత్ర గురించి మనం చదువుతాం. అప్పటి వరకు మధ్యలో దానికి సంబంధించిన ప్రస్తావన ఉండదు. కథ గమనాన్ని గుర్తుపెట్టుకోవడం, పాత్రల మధ్య సంబంధాన్ని గుర్తుంచుకోవడం, కథాంశం వివరాలను గుర్తుపెట్టుకోవడానికి చాలా జ్ఞాపకశక్తి అవసరం. ఇది మెదడుకు చక్కని వ్యాయామం అవుతుంది.
మెదడుకు మేత
జ్ఞాపక శక్తి మెరుగుపరచడంలో మెదడుకు మేత బాగా ఉపయోగపడుతుంది. మెదడుకు పనిచెప్పే ఫజిల్స్, అంకెల గారడి, సుడోకు, పదకేళి వంటి వాటిని నింపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెదడు పొరల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాలు, సమాచారాన్ని వెలికి తీయడంలో ఈ ఆటలు బాగా ఉపయోగపడతాయి.
మంచి నిద్ర
నిద్రలేమి కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందువల్ల రోజుకి కచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది పగటి నిద్ర మంచి కాదని అపోహ పడతారు. కానీ, మంచి జ్ఞాపకశక్తి కోసం పగటి పూట చిన్న కునుకు తీయడం అవసరమని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల మెదడు చక్కగా సమాచారాన్ని గ్రహించి తనలో భద్రపరుచుకొని తర్వాత అవసరానికి అనుగుణంగా గుర్తు చేస్తుంది. ఈ కునుకు విరామం 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఉంటే మంచిది. మరీ ఎక్కువ సమయం పడుకుంటే రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి కొద్దిసేపు మాత్రమే పడుకోవాలి.
పోషకాహారం
మనం తినే ఆహారం కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. తాజా కూరగాయలు, పండ్లు తినడం వల్ల మెదడు కణాల పనితీరు మెరుగు పడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీటిలో ఆహారం నిల్వ ఉండేందుకు రకరకాల ప్రిజర్వేటివ్‌లు కలుపుతారు. అందువల్ల అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అదనపు కొవ్వు, అధిక ఉప్పు శాతం, ప్రిజర్వేటివ్‌లు ఉండే ఆహారాలను తినకూడదు. ఈ ఆహారం జ్ఞాపక శక్తికి మంచిది కాదు. ఎందుకంటే మెదడు కణాల్లో రక్త ప్రసరణను తగ్గిస్తాయి. హైపర్ టెన్షన్, మధుమేహంకు దారి తీస్తాయి.