World Health Day: డిప్రెషన్‌లో ఉన్నవారితో ఇలా అనకండి
డిప్రెషన్.. ఈ మాట వింటేనే మనసంతా కలచివేసినట్లు ఉంటుంది. మాట్లాడకుండా, నవ్వకుండా అలా సైలెంట్‌గా ఉండేవారి మనసులో, మైండ్‌లో ఎలాంటి ఆలోచనలు తిరుగుతుంటాయో ఎవ్వరం చెప్పలేం. ఏం జరిగింది అని అడిగితే దుఖాన్ని ఆపుకోలేక ఏడ్చేస్తుంటారు కొందరు. అలాంటివారితో మంచి చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ ఈ విషయాలు మాత్రం అసలు చెప్పొద్దు అంటున్నారు వైద్య నిపుణులు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంటున్నారు. డిప్రెషన్‌లో ఉన్నవారితో చెప్పాల్సినవి, చెప్పకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
అరె అలా సరదాగా బయటికి వెళ్లు..
ఎవరైనా డల్‌గా ఉన్నట్లు కనిపిస్తే అసలు ఏం జరిగి ఉంటుందో అని కూడా ఆలోచించకుండా కొందరు ఈ మాట అనేస్తుంటారు. దాని వల్ల వారికి మరింత బాధే తప్ప సాంత్వన ఎక్కడా ఉండదు. ఇలా సరదాగా బయటికి వెళ్లు అని చెప్పడం కంటే.. నీతో కాసేపు సమయాన్ని గడుపుతాను. అలా బయటికి వెళ్లి ఏమైనా తిందాం అని చూడండి. కాస్తైనా తేలికపడతారు.
దాని గురించే బాధపడటం ఆపితే మంచిది
ఎవరి బాధలు వారికి పెద్దగా అనిపిస్తాయి. ఎదుటివారికి అవి చిన్నవిగా అనిపిస్తాయి. అలాంటి సమయాల్లో ఎందుకు దాని గురించే బాధపడుతూ కూర్చుంటావ్.. ఇక ఆపెయ్ అని మొహం మీదే అనేస్తుంటారు. ఇలా అనడం చాలా తప్పు. ఇలాంటి మాటలు వారి బాధను రెట్టింపు చేస్తాయి. దానికి బదులు.. నీ బాధ అర్థమైంది. నేనేమన్నా సాయం చేయగలనా? అని అడిగి చూడండి.
అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా నవ్వు
ఈ మాట వినగానే కొందరికి కోపం వచ్చేస్తుంది. ఎవ్వరికీ బాధపడుతూ కూర్చోవడం నచ్చదు. నవ్వుతూ జీవితాన్ని గడపాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే అయ్యిందేదో అయిపోయింది ఇకనైనా అన్నీ మర్చిపోయి జీవితంలో ముందుకు సాగిపోదాం అనుకుంటారు. చాలా మందికి మాత్రం ఇలా ఉండటం చాలా కష్టం. అలాంటప్పుడు.. నీ బాధను నాతో పంచుకో అని చెప్పి చూడండి. మీరు తీర్చేలేకపోయినా కనీసం వినండి. ఎదుటివారికి కూడా రిలీఫ్‌గా ఉంటుంది.
నువ్వు నన్నూ బాధపెడుతున్నావ్!
ఒకరి బాధను మరికొరితో పదే పదే చెప్పుకుంటున్నప్పుడు ఒక్కోసారి ఎదుటివారికి కూడా అబ్బా నా మూడ్ పాడైపోతోంది అనిపిస్తుంది. దాని అర్థం మిమ్మల్ని కూడా వారితో కలిసి బాధపడమని కాదు. కుదిరితే.. నేనున్నాను. ఇలాంటి సమయంలో వదిలేసి వెళ్లిపోను. నీకు ఏదైనా సాయం కావాలంటే అడుగు.. అన్న భరోసా కల్పించండి.
నాకూ వారంలో ఒకసారి ఇలా అనిపిస్తుంటుంది. ఏంకాదులే..!
గుర్తుంచుకోండి.. డిప్రెషన్ అనేది వారంలో ఒకసారో ఒక వారం నెలో ఉండేది కాదు. నెలల తరబడి మనిషిని మానసికంగా పీక్కుతినేస్తుంది. బాధలో ఉన్నవారితో నాక్కూడా ఒక్కోసారి ఇలా అనిపిస్తుంది అని అనకండి. మీకు బహుశా అలా అనిపించినా మీరు మళ్లీ మామూలు అయిపోతారు. కానీ డిప్రెషన్‌లో ఉండేవారికి అలా కాదు. నవ్వు ఎంత బాధపడుతున్నావో అర్థమవుతోంది. ఏమైనా ఉంటే నాతో చెప్పు అని చెప్పిచూడండి. బహుశా వారి బాధను నిజంగా మీరే తీర్చగలరేమో..!
నువ్వు గట్టోడివి అనుకున్నానే..!
కాస్త చిన్న విషయానికి అలిగినా.. నొచ్చుకున్న వెంటనే వచ్చే డైలాగ్ ఇది. నవ్వు గట్టోడివి అనుకున్నాను మరీ ఇంత సెన్సిటివ్ అనుకోలేదు అని. చూడటానికి అలా ఉన్నా వారి మనసు సున్నితం కావచ్చు. దీని నుంచి కూడా త్వరలో బయటపడగలవు అన్న ధైర్యాన్ని ఇవ్వండి.
అదంతా నీ ఆలోచనలోనే ఉంది
ఎవరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ముఖ్యంగా డిప్రెషన్లో ఉన్నవారి మైండ్‌సెట్ చాలా క్రిటికల్‌గా ఉంటుంది. ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు అదంతా నీ ఆలోచనల్లోనే ఉంది అని మాత్రం పొరపాటున కూడా అనకండి. దాని బదులు.. అందులో నీ తప్పేం లేదు. నిన్ను నువ్వు శిక్షించుకోవాల్సిన పనిలేదు అని చెప్పి చూడండి.
భారతదేశంలో అత్యధిక మరణాల్లో డిప్రెషన్ కారణంగా జరగుతున్న సూసైడ్లే ఎక్కువ ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. మన భారత్‌లోనే 5 కోట్ల మంది ఈ డిప్రెషన్ కారణంగా సతమతమవుతున్నారు. అందుకే.. డిప్రెషన్‌ను కూడా అనారోగ్య సమస్యగా పరిగణించి ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చారు.