ఇడ్లీకీ ఓ రోజుందని తెలుసా!

మదర్స్​ డే, ఫాదర్స్​ డే, చిల్డ్రన్​ డే, టీచర్​ డే.. ఒక్కో సందర్భానికీ ఒక్కో రోజు ఉన్నట్లే మనం రోజూ తినే ఇడ్లీకీ ఓ రోజుందని తెలుసా! అవును.. మార్చి 30ని అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. మనం సాధారణంగా తినే ఇడ్లీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం అంటే మామూలు విషయం కాదు కదా! ఈ సందర్భంగా ఇడ్లీ విశేషాలను తెలుసుకుందాం..

రుచితోపాటు ఆరోగ్యాన్ని పంచే అల్పాహారం ఏంటంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు ఇడ్లీ. నూనె తాకకుండా ఆవిరిపై తయారయ్యే ఈ ఇడ్లీకి మన దేశమే పుట్టిల్లు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఇడ్లీని, చట్నీ, సాంబార్​ కాంబినేషన్​తో తింటే ఆ రుచిని వర్ణించేందుకు మాటలు చాలవు. దక్షిణ భారతదేశంలో అధిక ఆదరణ పొందే అల్పాహారం ఇడ్లీనే. వైద్యులు సైతం  సూచించే మొట్టమొదటి ఆహారం ఇడ్లీ అంటేనే ఈ అల్పాహారం ఎంతటి పోషకాలు గలదో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నో రకాలు..

ఇడ్లీ ప్రధానంగా రకరకాల హోటళ్లు కూడా వెలిశాయంటే అతిశయోక్తి కాదు. బియ్యం పిండితోనే కాదు చిరుధాన్యాలతోనూ రకరకాల ఇడ్లీలు తయారై మరింత ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫ్లేవర్స్​. తమిళనాడులోని ఓ హోటల్ యజమాని ఏకంగా మూడు వేల రకాల ఇడ్లీలను అందిస్తూ ఇడ్లీమ్యాన్​గా ప్రసిద్ధి చెందారు. ఇడ్లీలు ఎన్ని రకాలు ఉన్నా వాటికుండే డిమాండే వేరు. ఒక్కో ప్రాంతంలో ప్రజలు ఒక్కో రకం ఇడ్లీ రుచిని ఇష్టపడుతారు. బెంగళూరులో రవ్వ ఇడ్లీ, మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రజలు కాస్త ఘాటు ఘాటుగా ఇడ్లీతో పాటు నెయ్యి, కారప్పొడి వంటి కాంబినేషన్లను ఇష్టపడతారు.  తమిళ తంబీలు సాంబార్​ ఇడ్లీతోపాటు నెయ్యి, కారప్పొడి కాంబినేషన్​నే ఇష్టపడతారు.

ఇడ్లీ తినేందుకు లక్షలు..

అంతర్జాతీయ ఇడ్లీ డే సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఒక్క ఏడాదిలో 6 లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్​ చేశారట. అంటే 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసాడని తెలిపింది స్విగ్గీ. హైదరాబాద్​లోనే కాదు బెంగళూరు, చెన్నైకి వెళ్లిన సమయాల్లోనూ  సదరు హైదరాబాదీ ఈ ఆర్డర్లు చేసినట్లుగా వెల్లడించింది.

అంతేకాదు, గత 12 నెలల్లో మొత్తం 33 మిలియన్ల ఇడ్లీలను డెలివరీ చేశామని తెలిపింది స్విగ్గీ. 2022 మార్చి 30 నుంచి 2023 మార్చి వరకు 25 వరకు వచ్చిన ఆర్డర్ల ఆధారంగా ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఇడ్లీ ఆర్డర్లు ఎక్కువగా చేసిన నగరాల్లో బెంగళూరు,హైదరాబాద్, చెన్నైలు ఉన్నాయట. ఆ తరువాత స్థానాల్లో కోయంబత్తూర్, ముంబై, పూనె, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్ కతా, కొచ్చి వంటి నగరాలు ఉండగా.. అక్కడ మాత్రం ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. అదీ మరి ఇడ్లీకున్న డిమాండ్​!