రక్తపోటుకు చెక్ పెట్టేయండిలా!
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా గుండె సమస్యలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటుకు ప్రధాన కారణం రక్తపోటు. ప్రస్తుత పరిస్థితులు, జీవనశైలి, ఒత్తిడి, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా హైబీపీ సాధారణ సమస్యగా మారిపోయింది. హైపర్‌టెన్షన్‌ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు హై బీపీ కారణమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తపోటు కంట్రోల్లో ఉండకపోతే హార్ట్ ఎటాక్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కిడ్నీ వ్యాధి, గర్భధారణ సమయంలో సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, స్ట్రోక్, వాస్కులర్ డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుని, మంచి ఆహారం తీసుకుంటే అధిక రక్తపోటు సమస్యని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు నిపుణులు. సోడియం అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే బీపీ పెరుగుతుంది. కాబట్టి లో సోడియం ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రక్తపోటుని నియంత్రించే ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం..
* ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి హైపర్‌టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో కేలరీలు తక్కువ, ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు రోజూవారి ఆహారంలో పాలకూర చేర్చుకుంటే మేలు.
* అధిక రక్తపోటు గలవారు అరటి పండ్లు తింటే చాలా మంచిది. ఈ పండ్లలో సోడియం తక్కువగా ఉండటమే కాదు, పొటాషియం మెండుగా ఉంటుంది.ఇది బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, బి6, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలూ మెండుగా ఉంటాయి. అంతేకాదు అరటి పండు తినడం వల్ల జీర్ణ సమస్యలూ దూరమవుతాయి.
* బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్ రక్త నాళాలను సడలించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చాలా అధ్యయనాల్లో తేలింది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవాళ్లు తరచూ బీట్‌రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
* ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేయడంలో బాగా పని చేస్తుంది. ఇది సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ తగ్గిస్తుంది. ప్రతి రోజూ సెలరీ తీసుకుంటే హైపర్‌టెన్షన్ తగ్గుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. సెలరీలో థాలైడ్‌లు ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, అధిక బీపీ స్థాయిలను తగ్గించడానికి , ధమనుల గోడలలోని కండరాల కణజాలాన్ని సడలించడానికి సహాయపడతాయి.
* దానిమ్మలో ఉండే పోషకాలు రక్త నాళాల పరిమాణాన్ని నియంత్రించి రక్తపోటును తగ్గిస్తాయి. దానిమ్మ రసంతో హానికారక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన ఫైబర్ దానిమ్మపండ్లలో అధికం.
పై ఆహార నియమాలు పాటిస్తూ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తే ఆందోళన, ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.