నల్లమచ్చలా.. కలబందతో విముక్తి
కలబందని సంస్కృతంలో కుమారీ అనీ, ఇంగ్లీష్‌లో అలోవెరా అనీ పిలుస్తారు. దీని ఆకుల నుంచి తీసే గుజ్జుని పలు ఔషధాల తయారీలో వాడతారు. కలబంద గుజ్జు ఎండబెడితే నల్లగా మారుతుంది. దానిని మూసాంబరం అంటారు. దీనిని నిల్వ ఉంచుకుని అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగించుకునే గొప్ప సంప్రదాయం మన తెలుగునాట యుగయుగాలుగా ఉంది. ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలోనే కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కలబందలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ లాంటి ప్రత్యేకమైన ఔషధ లక్షణాలు ఆరోగ్యానికీ, అందానికీ ఎంతగానో ఉపయోగపడతాయి. కలబంద వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
• కలబందలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయి.
• సాధారణoగా వయసు పెరిగే కొద్ది చర్మంపైన ముడతలు పడుతూ ఉంటాయి కానీ ఇతర కారణాలు వలన కొంత మందికి ఎక్కువ వయస్సు రాకుండానే చర్మంపై ముడతలు పడి ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తారు ఈ యాంటీ ఏజింగ్ సంకేతాలను నివారించడంలో కలబంద సహాయపడుతుంది.
• కలబంద, ఆలివ్ నూనెతో తయారు చేసిన ప్యాక్ ముఖానికి రాసుకుంటే చర్మం సున్నితంగా, మృదువుగా చేసి ముడతలను తగ్గిస్తుంది. చర్మంలో నీటిని పెంచి, జిడ్డుని తొలగించి చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. అంతే కాదు కలబంద గుజ్జు మొటిమలు తగ్గించడానికి చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జు, నిమ్మరసం కలిపి మొటిమలపై తరచుగా పూస్తే మొటిమలతోపాటు మచ్చలూ తగ్గిపోతాయి.
• అలోవెరా జెల్, కాటేజ్ చీజ్, ఖర్జూరం, కీర దోస రసాలని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి నిమ్మ రసం కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత కడిగేయాలి. పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ప్యాక్ వారానికోసారి వేసుకోవాలి.
• కలబంద యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌ని కలిగి ఉంటుంది. ఇది కొత్త కణాల అభివృద్ధిని ప్రేరేపించే పాలిసాకరైడ్స్ను కలిగి ఉంటుంది. వారానికోసారి క్రమం తప్పకుండా అలోవెరా జెల్ ప్యాక్ వేసుకుంటే పిగ్మెంటేషన్, వయసు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి.
• అలోవెరా జెల్, కీరా రసం, పెరుగు, రోజ్ నూనెను కలిపి ముఖం, మెడపై రాయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మంపై ర్యాష్, మురికి వదిలించటంలో ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోయాలి. 20 నిమిషాలాగి కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది.
• చర్మపు మృతకణాలు తొలిగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి ఇందులో ఓట్మీల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్‌లను ఎక్కువ మొత్తంలో తయారుచేసి గాలి చొరబడని డబ్బాల్లో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. కాలిన చోట కలబంద రసాన్ని రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
• కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పుసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.