డయాబెటిక్ పేషెంట్స్ కాఫీ తాగచ్చా?
మనిషికి ఒక్కసారి షుగర్ వ్యాధి సోకిందంటే సజావుగా సాగుతున్న జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అందులోనూ డయాబెటిక్ పేషెంట్లు ఏం తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. జీవితాంతం ఇన్సులిన్లు, మందులు తీసుకుంటూ ఉండాలి కాబట్టి వారికంటూ పర్టిక్యులర్ డైట్ రాసిస్తుంటారు వైద్యులు. అయితే డయాబెటిక్ పేషెంట్లు కాఫీ తాగొచ్చా లేదా అన్న విషయంపై చాలా మందిలో సందేహాలు ఉండే ఉంటాయి.
కాఫీ, టీలు తాగనిదే మన భారతీయులకు రోజు గడవదు. టైంకి వాటి డోస్ పడకపోతే పిచ్చెక్కినట్లు ఉంటుంది. అసలు ఏ పనీ చేయబుద్ది కూడా కాదు. కానీ డయాబెటీస్ వస్తే మాత్రం మరో ఆలోచన లేకుండా కెఫీన్‌ను పక్కన పెట్టేయాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు. సర్‌ప్రైజింగ్ విషయం ఏంటంటే.. కప్పు కాఫీ తాగేవారికి డయాబెటిస్ వచ్చే ముప్పు కొంతశాతం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఆల్రెడీ ఉన్నవారు మాత్రం టీ, కాఫీలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే కప్పు కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు 4% వరకు తగ్గుతుందట. కాఫీ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుందని చెబుతున్నారు. అయితే ఆల్రెడీ షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు మాత్రం కాఫీ తాగాలా వద్దా అనే విషయమై వైద్యులను సంప్రదించాల్సిందేనట. ఎందుకంటే షుగర్ వ్యాధి ఉన్నవారు కాఫీ తాగితే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. అయితే ఇది కచ్చితంగా రుజువైందని మాత్రం చెప్పలేమని అంటున్నారు ఆహార నిపుణులు. కాఫీకి బదులు చల్లటి మజ్జిగ, లెమన్ టీ, గ్రీన్ టీ తీసుకోవచ్చట.
ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే.. కాఫీలో కెఫీన్, పాలీఫెనాల్స్ మరియు మెగ్నీషియం, క్రోమియం వంటి మినరల్స్ ఉంటాయి. కెఫీన్ కారణంగా శరీరంలోని ఇన్సులిన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే కెఫీన్ ఎడినోసిన్ అనే ప్రొటీన్‌ను బ్లాక్ చేస్తుంది. శరీరానికి ఎంత మొత్తం ఇన్సులిన్ కావాలో చూసుకునే పని ఈ ఎడినోసిన్ ప్రొటీన్‌దే. కొన్ని పరిశోధనల ప్రకారం రోజుకి 200 మిల్లీగ్రాముల కెఫీన్ వల్ల బ్లడ్‌లోని షుగర్లపై ప్రభావం ఉంటుందట. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కాఫీ తాగచ్చు కానీ మితంగా తీసుకోవాలట. ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే పూర్తిగా కాఫీ మానేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఏదేమైనా ఆరోగ్యం విషయంలో ఫలానా విషయం కచ్చితంగా చెప్పలేం కాబట్టి వైద్యులు చెప్పినట్లు విని నడుచుకోవడం ఉత్తమం.