ట్రాఫిక్​ శబ్దాలతో ర‌క్త‌పోటు

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య హైపర్​ టెన్షన్​(రక్తపోటు). పని ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి కారణంగా ఈ సమస్య తలెత్తుతోందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక తాజా అధ్యయనం ప్రకారం ట్రాఫిక్​ శబ్దాలకూ బీపీ పెరుగుతుందట. అమెరికన్​ కాలేజ్​ ఆఫ్​ కార్డియాలజీ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం రోడ్డుపై ట్రాఫిక్, హారన్ల శబ్దాలకూ మన శరీరంలో రక్తపోటు స్థాయిల్లో తేడా వస్తుందని తేలింది. అధిక డెసిబెల్స్​ గల శబ్దాలను ఎక్కువసేపు వినడం వల్ల రోడ్డు ట్రాఫిక్​లో ఎక్కువగా గడిపేవారిలో హైపర్​ టెన్షన్​ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు పరిశోధకులు. రోడ్డుపైనే కాదు, ట్రాఫిక్​ ఎక్కువగా ఉండే రోడ్డుకు పక్కన ఉండే దుకాణాలు, నివాసాల్లో ఉండేవారిలోనూ ఈ సమస్య ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. వాహనాల వల్ల ఏర్పడే శబ్ద, వాయు కాలుష్యాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందట. పీల్చే గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడమే ఇందుకు కారణమంటున్నారు పరిశోధకులు.

ఎక్కువ సమయంపాటు రోడ్డు ట్రాఫిక్ శబ్దం, వాయు కాలుష్యంలో గడిపేవారిలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని కనుగొన్నారు. వీటిలో రక్తపోటు స్థాయిల పెరుగుదలకు ట్రాఫిక్ శబ్దాలే ప్రధాన కారణమని తేల్చారు. మొత్తం పర్యావరణం కంటే రోడ్డు ట్రాఫిక్​ శబ్దాలపై దృష్టిపెట్టడం చాలా ఆవశ్యకమని పరిశోధకుల్లో ఒకరైన జింగ్ హువాంగ్ చెబుతున్నారు.

అమెరికాలోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు UK బయోబ్యాంక్ నుండి 40 నుండి 69 సంవత్సరాల మధ్య వయస్సు గల 240,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల డేటాను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కాగా వీరికి ప్రాథమిక స్థాయిలో రక్తపోటు లేదు. 8.1 సంవత్సరాల తర్వాత, శాస్త్రవేత్తలు రక్తపోటు స్థాయిల్లో తేడా వచ్చిన వ్యక్తుల సంఖ్యకు సంబంధించిన డేటాను వేరు చేయగా, వారి పరిస్థితికి ప్రధాన కారణం ట్రాఫిక్​ శబ్దాలు అని తేలింది. నాయిస్ అసెస్‌మెంట్ పద్దతిలో నివాస ప్రాంతాల ఆధారంగా రహదారి ట్రాఫిక్ శబ్దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. అంతేకాదు, రహదారి ట్రాఫిక్ శబ్దం నుండి ఉపశమనం పొందగల మార్గాలను కూడా సూచించారు పరిశోధకులు. ఉదాహరణకు, కఠినమైన శబ్ద మార్గదర్శకాలు, వాటి అమలు, రహదారి పరిస్థితులు, పట్టణ రూపకల్పనను మెరుగుపరచడం, నిశ్శబ్ద వాహనాల కోసం అధునాతన సాంకేతికతను రూపొందించడం వంటి మార్గాలను సూచించారు. ఇక ఈ అధ్యయనం ప్రకారం హైపర్​ టెన్షన్​, ట్రాఫిక్​ శబ్దాలకు మధ్యగల సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి.