అధిక రక్తపోటుతో మతిమరుపు!
ఈరోజుల్లో చిన్నాపెద్దా, ఆడా మగ తేడా లేకుండా అందరినీ పలు రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి నలుగురిలో ఒకరు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొందరిలో జన్యుకారణాల వల్ల రక్తపోటు వస్తే మరికొందరిలో మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆందోళన, పనిఒత్తిడి కారణంగా రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. అధిక రక్తపోటు వల్ల గుండె సమస్యలు, వాస్క్యూలర్ సమస్యలు వస్తాయని తెలిసిందే. కాగా తాజాగా జరిపిన అధ్యయనాల్లో మరో కొత్త విషయం తేలింది. అధిక రక్తపోటు వల్ల మెదడు పనితీరు మందగించడంతోపాటు జ్ఞాపకశక్తి తగ్గిపోయి మతిమరుపుకు దారితీస్తుందట. కారణాలేమైనా సరే అదుపులో లేని బీపి మెదడుకు నష్టం చేస్తుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.
మెదడులోని జ్ఞాపకశక్తిని నియంత్రించే భాగం బలహీనపడినపుడు జ్ఞాపకశక్తి తగ్గిపొయ్యే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు మెదడులోని భాగాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కాన్ లను ఉపయోగించారు. మెదడులోని ఆలోచనా నైపుణ్యాలకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగం మీద ప్రభావం ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. బీపీతో బాధపడుతున్న ఇటాలియన్ రోగుల పైన చేసిన ప్రయోగాల్లో ఈ భాగాలు కచ్చితంగా ఆలోచనా నైపుణ్యం, జ్ఞాపకశక్తికి సంబంధించినవిగా నిర్థారణ కూడా జరిగింది. ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా డిమెన్షియాకు కొత్త నివారణ మార్గాలను కనుగొనేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన టొమాజ్ గుజిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బీపీతో బాధ పడుతున్న వారిలోని మెదడులోని కొన్ని భాగాలను నిశితంగా పరిశీలించినపుడు జ్ఞాపకశక్తి తగ్గడానికి ఎంత వరకు ఆస్కారాలు ఉన్నాయో అంచనా వేయడం సాధ్యం అవుతుంది. ఈ సమస్య తీవ్రంగా ఉండి ప్రమాదంలో ఉన్న వారికి మందులు కనిపెట్టడానికి మార్గం సుగమం అవుతుందని కూడా ఆయన తన నివేదికలో వివరించారు. ఇదివరకు జరిపిన పరిశోధనలో హైపర్ టెన్షన్ వల్ల వాస్క్యూలార్ డిమెన్షియాకు కారణం అవుతుందని నిరూపణ అయ్యింది. మెదడుకు జరిగే రక్తప్రసరణ తగ్గడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మెదడులోని నిర్ధిష్ట భాగాలలో మార్పులకు నిజంగా రక్తపోటు కారణం అవుతుందా అని జన్యుడేటాను కూడా పరిశీలించారు. మెదడులోని తొమ్మిది భాగాలు బ్లడ్ ప్రెషర్, కాగ్నిటివ్ పంక్షన్స్ కు సంబంధించినవిగా గుర్తించారు. మెదడులోని గుండ్రని ముందు భాగం కదలికలను అదుపు చెయ్యడానికి రకరకాల అభ్యాసాలను ప్రభావితం చేస్తుంది.
ఈ పరిశోధన వల్ల రక్తపోటు వల్ల మెదడులోని ఏ భాగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయో తెలిసిందని అది భవిష్యత్తులో మెదడు చికిత్సలను సులభతరం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు పరిశోధకులు. దీర్ఘకాలిక సమస్య అయిన రక్తపోటు నివారణ కష్టం, కానీ దీనిని నియంత్రించవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుని, సరైన జీవన శైలిని అనుసరించడం, భోజనంలో ఉప్పు తగ్గించడం, తగినంత వ్యాయామం, విశ్రాంతి ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. యోగ, వ్యాయామం, ధ్యానం వంటి ప్రశాంతత చేకూర్చే పనులపై శ్రద్ధపెట్టాలి. మెదడు కణాలను ఉత్తేజపరిచే పోషకాలు గల ఆహారం తీసుకోవడం మంచిది.