డిప్రెషన్‌ను ఇలా తరిమేయండి!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక అంశం ఒత్తిడికి దారితీస్తుంది. కుటుంబం, ఉద్యోగం అంటూ చాలామంది ఒత్తిడిలో జీవిస్తున్నారు. ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడిని తగ్గించుకుని వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒత్తిడి కారణంగా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఒత్తిడి పలు అనర్ధాలకు దారి తీస్తుంది. ఒత్తిడి వల్ల కలిగే చిరాకు, కోపం, అసహనం బంధాలు, బంధుత్వాలను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు రకరకాల మందులు వాడతారు చాలామంది. కానీ వీటివల్ల అనేక సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సులభంగా ఒత్తిడి తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకుందాం..
* తరచుగా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే మీపై మీరు శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే డీప్ డిప్రెషన్లోకి వెళతారు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో శరీరాన్ని, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతి విషయానికి కంగారు పడకుండా సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
* క్రమం తప్పకుండా రోజులో కొంత సమయం వ్యాయామం చేయడానికి కేటాయించాలి. ఇది మనస్సుకు విశ్రాంతినిస్తుంది. అంతేకాదు ఒత్తిడి, టెన్షన్ దూరమవుతుంది. ఇందుకోసం వర్కవుట్, వాకింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి. కండరాల రిలాక్స్ శరీరంలోని కండరాలకి విశ్రాంతినిస్తే ఒత్తిడి దానంతట అదే తగ్గుతుంది.
* స్ట్రెచింగ్, మసాజ్, రాత్రి మంచి నిద్ర వంటివి ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. తరచుగా ఒత్తిడికి గురవుతుంటే లోతైన శ్వాస తీసుకోవాలి. దీని కోసం ధ్యానం చేయాలి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ఒత్తిడి పనులు చేయవద్దు. అయినా తరచుగా ఒత్తిడికి గురవుతున్నట్లయితే వాటికి కారణాలు అన్వేషించాలి.
* ఒత్తిడిని ప్రేరేపించే పనులని చేయకూడదు. కొన్ని రోజులు విరామం తీసుకుంటే అంతా కుదుటపడుతుంది. విరామం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ముందుగా మనసులో కలిగే ఒత్తిడిని గుర్తించాలి. అప్పుడే నివారణ చర్యలపై దృష్టి పెడతారు. పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. ఒత్తిడికి గురయ్యే పనులని చేయరు.
* ఒత్తిడిగా ఉన్నప్పుడు మనసుకు నచ్చే పనులను చేయాలి. శ్రావ్యమైన సంగీతం ఒత్తిడిని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నచ్చిన పాటలు వినండి. స్నేహితులు, బంధువులతో మాట్లాడండి. పచ్చని పరిసరాలు గల ప్రాంతాల్లో గడపండి. ఇలాంటి పనులు చేయడం వల్ల మనుసుకి ప్రశాంతత దొరుకుతుంది.